Air India: ఎయిర్ఇండియాకు రూ. 24 వేల కోట్ల నష్టాలు

by S Gopi |

టాటా గ్రూప్ చేతుల్లోకి తిరిగి వెళ్లిన తర్వాత ఎయిర్ఇండియా ఈ స్థాయి వార్షిక నష్టాలను నమోదు చేయడం ఇదే మొదటిసారి.

Air India: ఎయిర్ఇండియాకు రూ. 24 వేల కోట్ల నష్టాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ఇండియా భారీ నష్టాలను నమోదు చేసింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన ఆర్థిక గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా 2.8 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో దాదాపు రూ. 23,500 కోట్లకు పైగా) నష్టాలను ఎదుర్కొంది. టాటా గ్రూప్ చేతుల్లోకి తిరిగి వెళ్లిన తర్వాత ఎయిర్ఇండియా ఈ స్థాయి వార్షిక నష్టాలను నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఈ భారీ నష్టాలకు ప్రధానంగా పెరిగిన జెట్ ఇంధన ధరలు, పాకిస్తాన్, పశ్చిమాసియా గగనతల ఆంక్షలు, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సరఫరా సమస్యలు కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య మార్గాల్లో నెలకొన్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ కార్యకలాపాల ఖర్చులు భారీగా పెరిగాయి. నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు ఎయిర్ఇండియా ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ సర్వీసులను తగ్గిస్తూ, కొన్ని విదేశీ మార్గాలను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, ఈ నష్టాలు తాత్కాలికమని టాటా గ్రూప్ భావిస్తోంది. విమానాల ఆధునీకరణ, కొత్త విమానాల కొనుగోలు, సేవల నాణ్యత పెంచడం, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ కోసం కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతోంది. పెరుగుతున్న పోటీ, అధిక నిర్వహణ వ్యయాలు, గ్లోబల్ అస్థిరతల మధ్య ఎంత వేగంగా నష్టాల నుంచి బయటపడుతుందనేదే కంపెనీ ముందున్న అతిపెద్ద సవాలు అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story