Air india: థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు

by S Gopi |   (  Updated:2025-06-13 16:03:13  IST  )

బాంబు బెదిరింపులకు పాల్పడింది ఎవరనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు.

Air india: థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: థాయిలాండ్‌లోని ఫుకెట్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయినట్టు విమానాశ్రయ అధికారులు ధృవీకరించారు. 156 మంది ప్రయాణికులతో ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్థానిక సమయం ప్రకారం ఉదయం 9:30 గంటలకు బయలుదేరింది. అయితే, అండమాన్ సముద్రం చుట్టూ తిరిగిన తర్వాత, విమానం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చి తిరిగి థాల్యాండ్‌కు తిరిగి వెళ్లింది. అహ్మదాబాద్ ఘటన జరిగిన ఒకరోజు తర్వాత ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లైట్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం, విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యే ముందు మధ్యలో వెనక్కి తిరిగినట్టు చూపించింది. బాంబు బెదిరింపు గురించి ఏఓటీ స్పష్టమైన వివరాలను వెల్లడించలేదు. ఈ విషయంపై ఎయిర్ ఇండియా కూడా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. బాంబు బెదిరింపులకు పాల్పడింది ఎవరనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, గత కొంత కాలం నుంచి భారత విమానయాన రంగం బాంబు బెదిరింపులను ఎదుర్కొంటోంది. అధికారిక సమాచారం ప్రకారం, గతేడాది మొదటి 10 నెలల్లోనే దాదాపు 1,000 మోసపూరిత కాల్స్, సందేశాలు వచ్చాయి. ఇది 2023లో వచ్చిన వాటి కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ.

ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలతో విమానాల డైవర్ట్

మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అనేక విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా శుక్రవారం ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేసింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంబై నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ఇండియా విమానాం ఏఐ131ను అత్యవసరంగా దారి మళ్లించింది. అనూహ్య నిర్ణయంతో అప్పటికే షెడ్యూల్ చేసిన కారణంగా దీంతో పాటు మరో 16 విమానాలను దారి మళ్లించినట్టు ఎయిర్ఇండియా వెల్లడించింది. వాటిలో కొన్ని విమానాలను వెనక్కి పిలిపించినట్టు తెలుస్తోంది. ఇరాన్ గగనతలాన్ని ఎప్పటివరకు మూసివేస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రావాలిస్ ఉంది. ప్రస్తుతానికి ఎయిర్ఇండియాతో పాటు ఇతర విమానయాన సంస్థలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలను నడపాలని నిర్ణయించాయి.

Next Story