Air india: 20 శాతం తగ్గిన ఎయిర్ఇండియా బుకింగ్‌లు

by S Gopi |

ఇదే సమయంలో ఫ్లైట్ టికెట్లు కూడా 8-15 శాతం క్షీణించాయని ఐఏటీఓ అధ్యక్షుడు రవి గొసైన్ తెలిపారు.

Air india: 20 శాతం తగ్గిన ఎయిర్ఇండియా బుకింగ్‌లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ఇండియా ఇబ్బందులను, ప్రయాణికుల విశ్వాసాన్ని కోల్పోతోంది. తాజాగా దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ఎయిర్ఇండియా విమానాల బుకింగ్స్ 20 శాతం తగ్గాయని ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టూర్‌ ఆపరేటర్స్‌(ఐఏటీఓ) శుక్రవారం ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో ఫ్లైట్ టికెట్లు కూడా 8-15 శాతం క్షీణించాయని ఐఏటీఓ అధ్యక్షుడు రవి గొసైన్ తెలిపారు. ఎయిర్ఇండియా ఏఐ-171 విమాన ఘటన తర్వాత అంతర్జాతీయ మార్గాల్లో ఎయిర్ఇండియా బుకింగ్స్ 18-22 శాతం మేర తగ్గడం చూశాం. దేశీయంగా కూడా 10-12 శాతం వరకు బుకింగ్స్ పడిపోయాయని అంచనా. ఎయిర్ఇండియా ఫ్లైట్ టికెట్ ధరలు కూడా 8-15 శాతం తగ్గాయి. ప్రధానంగా యూరప్, ఆగ్నేయాసియా రూట్లలో టికెట్ ధరలు 10-15 శాతం తగ్గినట్టు రవి గొసైన్ చెప్పారు. గిరాకీ దెబ్బతినడం వల్ల ఈ ప్రభావం ఉంది. ఇదే సమయంలో కొందరు టూర్ ఆపరేటర్ల ద్వారా బుక్ చేసుకున్న ఎయిర్ఇండియా ఫ్లైట్ టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. కార్పొరేట్, సంపన్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాలను ఎంచుకుంటున్నారు. ఇది స్వల్పకాలిక సెంటిమెంట్-ఆధారిత ప్రతికూల మాత్రమేనని, క్రమనగా ప్రయాణికులు ఎయిర్ఇండియాపై నమ్మకం తిరిగి పొందుతారని ఆయన పేర్కొన్నారు.

Next Story