WTO: 2040 నాటికి ఏఐ ద్వారా 40 శాతం పెరగనున్న ప్రపంచ వాణిజ్యం

by S Gopi |

వాణిజ్య ఖర్చులను తగ్గించడానికి, ఉత్పాదకతను పెంచేందుకు ఏఐకి అపారమైన సామర్థ్యం ఉంది.

WTO: 2040 నాటికి ఏఐ ద్వారా 40 శాతం పెరగనున్న ప్రపంచ వాణిజ్యం
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2040 నాటికి కృత్రిమ మేధస్సు (ఏఐ) కారణంగా దేశాల మధ్య వాణిజ్య విలువ దాదాపు 40 శాతం పెరుగుతుందని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తెలిపింది. ఉత్పాదకత పెరుగుదల, తక్కువ వాణిజ్య ఖర్చుల ద్వారా ఇది పెరిగేందుకు దోహదపడుతుందని బుధవారం విడుదల చేసిన ప్రపంచ వాణిజ్య నివేదిక-2025 ఎడిషన్‌లో పేర్కొంది. అయితే, ఏఐ, వాణిజ్యం రెండూ వృద్ధికి దోహదపడాలంటే, డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి, శ్రామిక శక్తి నైపుణ్యాలలో పెట్టుబడులకు, సానుకూల పెట్టుబడుల వాతావరణం కొనసాగే విధానాలు అమలులో ఉండాలి అని నివేదిక అభిప్రాయపడింది. వాణిజ్య ఖర్చులను తగ్గించడానికి, ఉత్పాదకతను పెంచేందుకు ఏఐకి అపారమైన సామర్థ్యం ఉంది. అయితే, ఏఐ సాంకేతికతలకున్న యాక్సెస్, డిజిటల్ వాణిజ్యంలో చొచ్చుకుపోవడంలో వ్యత్యాసం అధికంగా ఉందని డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ న్గోజీ ఒకోంజో-ఇవేలా అన్నారు. నివేదిక ప్రకారం, 2040 నాటికి ఏఐ వాణిజ్యం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉంది. తక్కువ, మధ్య, అధిక-ఆదాయ దేశాల మధ్య వివిధ స్థాయిలలో పాలసీలు, సాంకేతికత ఆధారంగా ప్రపంచ వాణిజ్యం 34-37 శాతం మేర పెరుగుతుందని అంచనా. తక్కువ, మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థలు అధిక-ఆదాయ ఆర్థిక వ్యవస్థలతో తమ డిజిటల్ మౌలిక సదుపాయాల అంతరాన్ని 50 శాతం తగ్గించుకుని, ఏఐని మరింత విస్తృతంగా వినియోగిస్తే, ఈ ఆర్థిక వ్యవస్థల(తక్కువ, మధ్య దేశాల) ఆదాయాలు వరుసగా 15 శాతం, 14 శాతం పెరుగుతాయని నివేదిక పేర్కొంది.

Next Story