Telecom: టెలికాం సైబర్ భద్రతపై కేంద్రం అలర్ట్

by S Gopi |

కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల టెలికాం కంపెనీలు, టెక్నాలజీ నిపుణులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

Telecom: టెలికాం సైబర్ భద్రతపై కేంద్రం అలర్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆంత్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్ మిథోస్ వంటి అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్స్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న వేళ, భారత ప్రభుత్వం టెలికాం రంగ సైబర్ భద్రతపై అప్రమత్తమైంది. జాతీయ భద్రతకు కీలకమైన టెలికాం మౌలిక సదుపాయాలపై ఈ కొత్త తరహా ఏఐ మోడల్స్ ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయడానికి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల టెలికాం కంపెనీలు, టెక్నాలజీ నిపుణులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. త్వరలో మరో సమావేశం జరగనుండగా, అందులో టెలికాం కంపెనీలు తమ సైబర్ భద్రత ప్రణాళికలను సమర్పించే అవకాశం ఉంది. పరిశ్రమ నిపుణుల ప్రకారం, క్లాడ్ మిథోస్ వంటి ఏఐ మోడల్స్ సంప్రదాయ సైబర్ దాడులను మరింత ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లగలవు. ఇవి నెట్‌వర్క్‌లలోని లోపాలను స్వయంగా గుర్తించడం, ఏపీఐల ద్వారా లోపాలను వాడుకోవడం, క్లౌడ్ ఆధారిత టెలికాం వ్యవస్థలను పెద్ద ఎత్తున లక్ష్యంగా చేసుకోవడం వంటి సామర్థ్యాలు కలిగి ఉంటాయని చెబుతున్నారు. భారతీయ టెలికాం రంగానికి సంబంధించి, దేశీయ ఆపరేటర్లు ఇప్పటికీ నోకియా, ఎరిక్సన్ వంటి యూరోపియన్ వెండర్ల సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రస్తుతానికైతే గ్లోబల్ వెండర్లతో ఉన్న బలమైన సాంకేతిక సంబంధాల దృష్ట్యా టెలికాం ఎకోసిస్టమ్ మెరుగైన స్థితిలో ఉందని పీడబ్ల్యూసీ టెలికాం విభాగాధిపతి వినీష్ బవా పేర్కొన్నారు.

Next Story