Platinum Imports: ప్లాటినం ఆభరణాల దిగుమతులపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం

by S Gopi |

దిగుమతిదారులు ఎలాంటి వస్తువులను దిగుమతి చేసుకోవాలన్నా, ముందుగా డీజీఎఫ్‌టీ నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.

Platinum Imports: ప్లాటినం ఆభరణాల దిగుమతులపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: విలువైన లోహాల దిగుమతులపై కేంద్రం కఠిన నిబంధనలు అమలుచేస్తోంది. ఇటీవలే వెండి ఆభరణాల దిగుమతులపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు అంక్షలు విధించిన కేంద్రం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల ప్లాటినం ఆభరణాల దిగుమతులను పరిమితం చేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్‌టీ) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది 2026, ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. దిగుమతిదారులు ఎలాంటి వస్తువులను దిగుమతి చేసుకోవాలన్నా, ముందుగా డీజీఎఫ్‌టీ నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అనవసరమైన దిగుమతులను అరికట్టడానికి, విదేశీ మారక నిల్వలను కాపాడటానికి, ద్వైపాక్షిక, ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాల ప్రకారం న్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరించేందుకు ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగమని డీజీఎఫ్‌టీ వెల్లడించింది. ఈ నిర్ణయం ఉన్న సమయంలో స్టడ్ చేయని, సెమీ-ఫినిష్డ్ ఆభరణాలతో సహా అన్ని ప్లాటినం ఆభరణాల దిగుమతులకు ముందస్తు అనుమతి అవసరం.

Next Story