Stock Market: మళ్లీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

by S Gopi |
Stock Market: మళ్లీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అధిక నష్టాలు తప్పట్లేదు. అంతకుముందు సెషన్‌లో అమెరికా మాంద్యం వార్తలతో పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడి లోనై సూచీలు రికార్డు స్థాయిలో నష్టాలను ఎదుర్కొన్నాయి. మంగళవారం ట్రేడిగ్‌లోనూ అదే ధోరణి కనబడింది. అయితే, ఉదయం రికార్డు నష్టాల తర్వాత కొనుగోళ్లు, గ్లోబల్ మార్కెట్ల నుంచి లభించిన సానుకూల సంకేతాలతో భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు మిడ్-సెషన్ తర్వాత తిరిగి నష్టాలకు జారాయి. ప్రధానంగా బ్లూచిప్ షేర్లు ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లను మదుపర్లు విక్రయించడంతో ఓ దశలో వెయ్యి పాయింట్ల వరకు లాభాలు చూసిన సెన్సెక్స్ నష్టపోయింది. నిఫ్టీ సైతం మళ్లీ 24 వేల దిగువకు పడిపోయింది. దీంతో మార్కెట్లు ముగిసె సమయానికి సెన్సెక్స్ 166.33 పాయింట్లు నష్టపోయి 78,593 వద్ద, నిఫ్టీ 63.05 పాయింట్ల నష్టంతో 23,992 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మెటల్, మీడియా, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించగా, మిగిలిన రంగాలు దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఎల్అండ్‌టీ, హెచ్‌సీఎల్ టెక్, హిందూస్తాన్ యూనిలీవర్, రిలయన్స్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.94 వద్ద ఉంది.

Advertisement

Next Story