Adani Wilmar: అదానీ విల్మార్ నుంచి నిష్క్రమించేందుకు రూ. 10 వేల కోట్లతో ఒప్పందం

by S Gopi |

దీనికోసం రూ. 10,874 కోట్లకు ఒప్పందం కుదిరినట్టు స్పష్టం చేసింది.

Adani Wilmar: అదానీ విల్మార్ నుంచి నిష్క్రమించేందుకు రూ. 10 వేల కోట్లతో ఒప్పందం
X

దిశ, బిజినెస్ బ్యూరో: సింగపూర్‌కు చెందిన విల్మార్ ఇంటర్నేషనల్‌తో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ అదానీ విల్మర్‌ లిమిటెడ్‌ నుంచి అదానీ గ్రూప్‌ నిష్క్రమించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ నుంచి బయటకు వచ్చేందుకు వాటాను విక్రయం ఖరారైందని ప్రకటించింది. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్‌లో అదానీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఉన్న మొత్తం వాటాను అమ్ముతున్నట్టు తెలిపింది. దీనికోసం రూ. 10,874 కోట్లకు ఒప్పందం కుదిరినట్టు స్పష్టం చేసింది. అదానీ విల్మార్‌లో అదానీ కమోడిటీస్‌కు ఉన్న 30.42 శాతం వాటాలో 20 శాతం విల్మార్‌కు విక్రయించనుంది. మిగిలిన మొత్తాన్ని ముందుగా ఎంపిక చేసిన ఇన్వెస్టర్లకు అమ్మనున్నట్టు అదానీ ఎంటర్‌ప్రైజెస్ అధికారికంగా వెల్లడించింది. అదానీ కమోడిటీస్ తన వాటా కింద ఉన్న షేర్లను రూ. 275 చొప్పున విక్రయించాలని నిర్ణయించినట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. అదానీ కంపెనీ వాటా అమ్మకం తర్వాత విల్మార్ ఇంటర్నేషాల్ ఏడబ్ల్యూ అగ్రి బిజినెస్‌లో 63.94 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. కాగా, 1999లో సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే విల్మార్ ఇంటర్నేషనల్‌తో కలిసి అదానీ గ్రూప్ ఎఫ్ఎంసీజీ రంగంలో 'అదానీ విల్మార్' జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఇరు సంస్థలకు 43.97 శాతం మేర వాటాల కింద ఒప్పందం జరిగింది. ఈ జాయింట్ వెంచర్‌కు దేశీయంగా 'ఫార్చ్యూన్ ' బ్రాండ్ పేరుతో వంటనూనె విభాగంలో గణనీయమైన వాటా ఉంది. 22 కంటే ఎక్కువ తయారీ ప్లాంట్లు, పంపిణీ నెట్‌వర్క్‌తో, కంపెనీ దేశంలో 16 లక్షలకు పైగా రిటైల్ అవుట్‌లెట్‌లకు నిర్వహిస్తోంది. ఎఫ్ఎంసీజీ నుంచి బయటకొచ్చి ప్రధాన విభాగమైన ఇన్‌ఫ్రా రంగంపై దృష్టి సారించాలని అదానీ గ్రూప్ నిర్ణయించుకుంది.

Next Story