Adani Group: సెబీ క్లీన్‌చిట్‌తో రూ. 69 వేల కోట్లు పెరిగిన అదానీ గ్రూప్ మార్కెట్ విలువ

by S Gopi |

అదానీ గ్రూప్‌పై ఆరోపణలను సెబీ క్లియర్ చేయడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ పుంజుకుంది.

Adani Group: సెబీ క్లీన్‌చిట్‌తో రూ. 69 వేల కోట్లు పెరిగిన అదానీ గ్రూప్ మార్కెట్ విలువ
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలు నిరాధారమని తాజాగా భారతీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో శుక్రవారం ఒక్కరోజే అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ రూ. 69,000 కోట్లకు పైగా పెరిగింది. అదానీ గ్రూప్‌పై ఆరోపణలను సెబీ క్లియర్ చేయడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ పుంజుకుంది. అత్యధికంగా లాభాలను చూసిన కంపెనీల్లో అదానీ పవర్ షేర్ 12.40 శాతం పెరగ్గా, అదానీ టోటల్ గ్యాస్ 7.35 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 5.33 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5.04 శాతం రాణించాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 4.70 శాతం పెరిగాయి. మిగిలిన వాటిలో సంఘి ఇండస్ట్రీస్, ఏసీసీ లాంటి కంపెనీలు కూడా మెరుగైన ర్యాలీని చూశాయి. కాగా, 2023 జనవరిలో అదానీ గ్రూప్ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, మార్కెట్‌ అవకతవకలు, పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌లో పలు కంపెనీల నుంచి నిధులను ఆడికార్ప్, మైల్‌స్టోన్‌ ట్రేడ్‌లింక్స్, రేవర్‌ఇన్‌ఫ్రా ద్వారా లిస్టెడ్ కంపెనీలైన అదానీ పవర్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లోకి మళ్లించారని కూడా ఆరోపించింది. అయితే, దీనిపై గతంలో సుప్రీంకోర్టు కూడా అలాంటి ఉల్లంఘనలు జరగలేదని చెప్పడం, తాజాగా సెబీ దర్యాప్తులో అవకతవకలు జరగలేదని తేలడంతో అదానీ గ్రూప్‌నకు భారీ ఉపశమనం లభించింది.

Next Story