Accenture: సీనియర్ ఉద్యోగులు ఏఐ టూల్స్ నేర్చుకుంటేనే ప్రమోషన్లు

by S Gopi |

సీనియర్ ఉద్యోగులు ప్రమోషన్లు కావాలంటే ఏఐ టూల్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలని స్పష్టం చేస్తోంది.

Accenture: సీనియర్ ఉద్యోగులు ఏఐ టూల్స్ నేర్చుకుంటేనే ప్రమోషన్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేధస్సు(ఏఐ) ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో టెక్ రంగ కంపెనీలు అందుకనుగుణంగా మార్పులు చేస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ విస్తరిస్తున్న వేగంతో ఉద్యోగులూ కూడా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని, మెరుగైన పనితీరు ఉండాలని ఆశిస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం యాక్సెంచర్‌ మరో ముందడుగు వేసి కంపెనీలోని సీనియర్ ఉద్యోగులు ప్రమోషన్లు కావాలంటే ఏఐ టూల్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలని స్పష్టం చేస్తోంది. వారు నేర్చుకునే ఏఐ టూల్స్ ఆధారంగానే లీడర్‌షిప్ రోల్స్ ఉంటాయని, లేదంటే ప్రమోషన్లు ఉండవని తెలిపింది. దీనికి సంబంధించి కంపెనీ సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్లకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించింది. ఇటీవల కంపెనీ ఏఐపై దృష్టి సారించి రీస్కిల్ సాధ్యంకాని ఉద్యోగులను తొలగించింది. ఈ క్రమంలోనే 11 వేల మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చి సాగనంపింది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకుంది. ఇటీవలే గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సైతం ఇదే తరహా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ ఏఐ ప్రణాళికలకు సిద్ధంగా లేని ఉద్యోగులు స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవచ్చని ఉద్యోగులకు స్పష్టం చేసింది. స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని వారికి ఆఫర్ చేసింది.

Next Story