- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
New Financial Changes: నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక ఆర్థిక మార్పులు
బ్యాంకింగ్, టాక్స్ ఫైలింగ్, రైల్వే, పాన్-ఆధార్ లింక్ వంటి రోజూవారీ పనులపై ప్రభావం చూపే అంశాలున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాదికి సంబంధించి మరో నెల చరిత్రలో కలిసిపోయింది. ఈ క్రమంలో జూలై 1 నుంచి కొన్ని ముఖ్యమైన ఆర్థిక మార్పులు మన దైనందిన జీవితంలో చోటుచేసుకోనున్నాయి. వాటిలో బ్యాంకింగ్, టాక్స్ ఫైలింగ్, రైల్వే, పాన్-ఆధార్ లింక్ వంటి రోజూవారీ పనులపై ప్రభావం చూపే అంశాలున్నాయి. అవేంటంటే..
కొత్త పాన్ కోసం ఆధార్ అవసరం
మంగళవారం నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) పాన్ కార్డ్ దరఖాస్తులకు ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేసింది. ఇప్పటికే ఉన్న పాన్ హోల్డర్లు డిసెంబర్ 31 లోపు వారి ఆధార్ నంబర్లను లింక్ చేయాలి. ఇప్పటివరకు కొత్త పాన్ కార్డ్ దరఖాస్తులకు డ్రైవింగ్ లైసెన్స్, జనన ధృవీకరణ పత్రం వంటివి సరిపోయేవి. కానీ, ఇకపై ఆధార్ అవసరమవుతుంది. నిర్దిష్ట గడువులోగా పాన్-ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది.
తత్కాల్ రైలు టికెట్ బుకింగ్‌లు
ఇకపై తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి కూడా ఆధార్ ధృవీకరణ తప్పనిసరి. అలాగే, జూలై 15 నుంచి రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్‌కు పంపబడే వన్-టైమ్ పాస్‌వర్డ్‌తో సహా అన్ని టిక్కెట్ల కోసం టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్ అవసరం. రైల్వే టికెట్ ధరలను కూడా పెంచారు, అవి జూలై నుంచి అమలవుతాయి.
ఐటీఆర్ దాఖలు గడువు
ఐటీఆర్ లేదా ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఇది వేతనజీవులకు ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి అదనంగా 46 రోజుల సమయం ఇస్తుంది. అయితే, డాక్యుమెంటేషన్ సిద్ధంగా ఉన్నవారు పాత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయవచ్చు.
క్రెడిట్ కార్డ్ మార్పులు
విమాన టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఎస్‌బీఐ ఎలైట్, మైల్స్ ఎలైట్, మైల్స్ ప్రైమ్ వంటి ఎంపిక చేసిన ప్రీమియం కార్డులను ఉపయోగించినప్పుడు లభించే విమాన ప్రమాద బీమాను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ నిలిపివేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు ఎంపిక చేసిన లావాదేవీలపై ఛార్జీల సవరణను జూలై 1 నుంచి అమలు చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డును ఉపయోగించి అద్దె చెల్లించినా లేదా ఆన్‌లైన్ స్కిల్ బేస్‌డ్ గేమ్స్‌పై రూ. 10,000 కంటే ఎక్కువ ఖర్చు చేసినా, ఒక శాతం లావాదేవీ రుసుము అమలవుతుంది. యుటిలిటీ చెల్లింపులు నెలకు రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే కూడా 1 శాతం రుసుమును వర్తిస్తుంది. ఇందులో బీమా లావాదేవీలక మినహాయింపు ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన ఏటీఎం లావాదేవీలతో సహా సేవల ఛార్జీలకు సవరణలు చేసింది. ఐదు ఉచిత లావాదేవీల తర్వాత నగదు విత్‌డ్రాకు ఒక్కో లావాదేవీపై రూ. 23 చెల్లించాలి. ఆర్థికేతర లావాదేవీలు ఉచితంగానే ఉంటాయి.






