వినియోగదారులకు దిమ్మతిరిగే షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-01 04:21:42  IST  )

కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు ఊహించని షాకిచ్చాయి.

వినియోగదారులకు దిమ్మతిరిగే షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తల నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరలతో సతమతమవుతున్న సామాన్యులు, ముఖ్యంగా హోటల్, వ్యాపార రంగాల వారికి ఆయిల్ కంపెనీలు భారీ షాకిచ్చాయి. ఈ మేరకు ఇవాళ్టి నుంచి 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరను భారీగా పెంచాయి. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ.993 అదనపు భారాన్ని మోపాయి. ఈ భారీ పెంపుతో దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరలు మూడు వేల మార్కును దాటేశాయి. హైదరాబాద్‌‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ధర రూ.3,069కు చేరింది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో రూ.3,071.50 వద్ద ఉంది. గత నెలలో కూడా కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచిన కంపెనీలు, ఈసారి ఏకంగా వెయ్యి రూపాయలకు దగ్గరగా ధరను పెంచడం గమనార్హం.

డొమెస్టిక్ గ్యాస్ ధరలు యథాతథం..

అయితే, సాధారణ ప్రజలకు మాత్రం ఊరటనిస్తూ 14.2 కేజీల గృహ వినియోగ (Domestic) సిలిండర్ ధరలో ఆయిల్ కంపెనీలు ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే, గత నెలలో డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.60 పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గృహ వినియోగదారులకు పాత ధరలే వర్తించనున్నాయి. 5 కేజీల ఫ్రీ ట్రేడ్ సిలిండర్ ధరపై రూ.261 పెంచారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధ వాతావరణం, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగింది. ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ గుండా ఎల్పీజీ దిగుమతులు నిలిచిపోవడంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని, అందుకే ఈ స్థాయిలో రేట్లు పెంచాల్సి వచ్చిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Next Story