- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Loans: 90 శాతం పెరిగిన గోల్డ్ లోన్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బంగారు రుణాలు ఏకంగా 90.3 శాతం పెరిగాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా రిటైల్ రుణాలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తుండటంతో గోల్డ్ లోన్ విభాగం మిగతా వాటికంటే అత్యంత వేగంగా పెరుగుతోందని ఓ నివేదిక తెలిపింది. సీఆర్ఐఎఫ్ హై మార్క్ సంస్థ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బంగారు రుణాలు ఏకంగా 90.3 శాతం పెరిగాయి. ధరలు రికార్డు గరిష్ఠాలకు చేరడమే దీనికి కారణం. చాలామంది తమ వద్ద బంగారాన్ని లాకర్లలో దాచుకోవడం కంటే వాటిని తనఖా పెట్టి రుణం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారని నివేదిక అభిప్రాయపడింది. మొత్తంగా దేశ రిటైల్ రుణ మార్కెట్ సుమారు రూ. 162.7 లక్షల కోట్లకు చేరుకుందని నివేదిక తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో వాహన రుణాలు కూడా గణనీయంగా పెరిగాయి. టూ-వీలర్ విభాగంలో రుణాలు 46.7 శాతం పెరగ్గా, కార్ల రుణాలు 22.1 శాతం పెరిగాయి. పండుగ సీజన్ డిమాండ్‌కు తోడు కేంద్రం చేసిన జీఎస్టీ పన్ను మార్పుల వల్ల ఈ విభాగంలో ఎక్కువ లోన్లు తీసుకున్నారు. ఎలక్ట్రానిక్స్ లాంటి వినియోగ వస్తువుల విభాగంలో కూడా రుణాలు 14.7 శాతం పెరిగాయి. వీటి లోన్లకు పండుగ సీజన్ ఎక్కువ దోహదపడిందని నివేదిక పేర్కొంది.
మరో ఆసక్తికరమైన విషయమేంటంటే.. ప్రజలు గతంలో కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటున్న ధోరని పెరిగిందని నివేదిక చెబుతోంది. బంగారు రుణాల్లో రూ. 5 లక్షలకు పైగా ఉన్నవి మొత్తం విలువ 36.5 శాతంగా ఉన్నాయి. గతేడాది ఇది 24 శాతం మాత్రమే ఉండేవి. అలాగే, సగటు ఇంటి రుణం సుమారు రూ. 33 లక్షలకు పెరిగిందని, రూ. 75 లక్షలకు పైగా విలువైన హోమ్ లోన్స్ 40 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇదే సమయంలో రూ. 5 లక్షలకు పైగా ఉన్న పర్సనల్ లోన్ విభాగంలో డిఫాల్ట్ అవుతున్నవి తక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది.






