Indian Oil Companies: భారతీయ చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

by S Gopi |

'మ్యాక్జిమమ్ ప్రెజర్ క్యాంపెయిన్' లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.

Indian Oil Companies: భారతీయ చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇప్పటికే భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన అగ్రరాజ్యం అమెరికా, గురువారం మరో కీలక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌తో చమురు, పెట్రోకమికల్ ఉత్పత్తుల వాణిజ్యం చేస్తున్న ఆరోపణలతో భారత్‌కు చెందిన ఆరు ప్రముఖ చమురు కంపెనీలపై ఆర్థికపరమైన ఆంక్షలను ప్రకటించింది. ఇవే ఆరోపణల మీద అంతర్జాతీయంగా 20 ఆయిల్ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. అందులో మన దేశానికి చెందిన ఆరు కంపెనీలు ఉన్నాయి. ఇరాన్ చమురు వ్యాపారాలను నిలువరించేందుకు 'మ్యాక్జిమమ్ ప్రెజర్ క్యాంపెయిన్' లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. చమురు అమ్మకాల ద్వారా వచ్చే నిధులతో మధ్యప్రాచ్యంలో ఘర్షణలు, అస్థిరతకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. సొంత ప్రజలతో పాటు ప్రపంచంపై దాడికి ఉగ్రవాద ముఠాలకు ఆర్థిక మద్దతు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ఆర్థికపరమైన ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించాం. ఇరాన్ నుంచి చమురు, పెట్రో కెమికల్ ఉత్పత్తుల వాణిజ్యం చేస్తున్న 20 కంపెనీలపై ఆంక్షలు విధించామని అమెరికా అధికారిక ప్రకటన జారీ చేసింది. ఇరాన్‌తో చమురు, పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల కొనుగోలు కొనసాగించే దేశాలు అమెరికాతో వాణిజ్యానికి అర్హత కోల్పోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

అమెరికా ఆంక్షలు విధించిన భారతీయ చమురు కంపెనీలు

* అల్కెమికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అతిపెద్ద ఆరోపణలను ఎదుర్కొంటోంది, 2024, జనవరి-డిసెంబర్ మధ్య వివిధ కంపెనీల నుంచి 84 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఇరానియన్ పెట్రోకెమికల్ ఉత్పత్తులను దిగుమతి చేసినట్టు అమెరికా ఆరోపించింది.

* గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్ (గ్లోబల్ ఇండస్ట్రియల్) జాబితాలో రెండవ స్థానంలో ఉంది. 2024, జూలై నుంచి 2025, జనవరి మధ్య 51 మిలియన్ డాలర్లకు పైగా విలువైన మిథనాల్‌తో సహా ఇరానియన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్టు ఆరోపణలు.

* జూపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ (జూపిటర్ డై కెమ్) కంపెనీ 2024, జనవరి నుంచి 2025, జనవరి మధ్య 49 మిలియన్ డాలర్లకు పైగా విలువైన టోలుయిన్‌తో సహా ఇరానియన్ పెట్రోకెమికల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది.

* రామ్నిక్‌లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ (రామ్నిక్‌లాల్) మరొక పెట్రోకెమికల్ కంపెనీ. 2024, జనవరి నుంచి 2025, జనవరి మధ్య 22 మిలియన్ డాలర్లకు పైగా విలువైన మిథనాల్, టోలుయిన్‌తో సహా ఇరానియన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుందని అగ్రరాజ్యం అభియోగాలు మోపింది.

* పెర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ యూఏఈకి చెందిన కమోడిటీస్ ట్రేడింగ్ కంపెనీ బాబ్ అల్ బర్షాతో సహా వివిధ కంపెనీల నుంచి 2024, అక్టోబర్-డిసెంబర్ మధ్య ఇరాన్ పెట్రోకెమికల్స్, మిథనాల్ వంటి దాదాపు 14 మిలియన్ డాలర్ల విలువైన షిప్‌మెంట్‌లను దిగుమతి చేసుకుందని అమెరికా తెలిపింది.

* కాంచన్ పాలిమర్స్ తనైస్ ట్రేడింగ్ నుంచి పాలిథిలిన్‌తో సహా 1.3 మిలియన్ డాలర్లకు పైగా ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది.

Next Story