Billionaires Wealth: బిలీయనీర్ల సంపద రూ. 1,660 లక్షల కోట్లు

by S Gopi |

ప్రపంచ సంపద మునుపెన్నడూ లేనంత వేగంగా పెరగడమే కాకుండా, అది రాజకీయ శక్తిగా కూడా వేగంగా మారుతోందని తెలిపింది.

Billionaires Wealth: బిలీయనీర్ల సంపద రూ. 1,660 లక్షల కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన లీడర్లు, ఆర్థికవేత్తలు, బిలియనీర్లు ఈ ఏడాది వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సమావేశం కోసం దావోస్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ తన కొత్త నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించింది. దాని ప్రకారం, ప్రపంచ సంపద అసమానత అత్యంత ప్రమాదకరమైన కొత్త దశలోకి ప్రవేశించిందని, సంపద మునుపెన్నడూ లేనంత వేగంగా పెరగడమే కాకుండా, అది రాజకీయ శక్తిగా కూడా వేగంగా మారుతోందని తెలిపింది. సాధారణ ప్రజలతో పోలిస్తే బిలియనీర్లు రాజకీయ పదవులు చేపట్టే అవకాశాలు ఇప్పుడు 4,000 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాలకు తీవ్ర అస్థిరతను కలిగిస్తాయని ఆక్స్‌ఫామ్ అభిప్రాయపడింది. అదే సమయంలో, ప్రపంచ బిలియనీర్ల మొత్తం సంపద 2025లో రికార్డు స్థాయిలో 18.3 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది, ఇది గత ఐదేళ్ల సగటు వేగం కంటే మూడు రెట్లు వేగంగా పెరిగింది. మన కరెన్సీలో చెప్పాలంటే, ఈ మొత్తం రూ. 1,660 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ మొత్తం చాలా దేశాల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కంటే చాలా ఎక్కువ.

ఈ సందర్భంగా ధనవంతులు చాలా శక్తివంతులుగా మారుతున్నారని ఆక్స్‌ఫామ్ హెచ్చరిస్తోంది. బిలియనీర్లు చాలా వేగంగా ధనవంతులుగా, మరింత శక్తివంతులుగా మారుతున్నారు. వారి సంపద ఒక సంవత్సరంలో 16 శాతం, 2020 నుంచి 81 శాతం పెరిగింది. స్టాక్ మార్కెట్లు, ఏఐ కంపెనీలు, వారికి అనుకూలంగా ఉండే పాలసీలు ధనవంతులకు కలిసొచ్చింది. కేవలం ఒక ఏడాది వ్యవధిలో బిలియనీర్లు 2.5 ట్రిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 227.19 లక్షల కోట్లు) సంపాదించారు, ఇది ప్రపంచ జనాభాలో సగం మంది సంపదకు సమానం. ఈ సంపదను ఉపయోగించి తీవ్ర పేదరికాన్ని అనేక రెట్లు అంతం చేయవచ్చని ఆక్స్‌ఫామ్ పేర్కొంది.

Next Story