- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: రష్యన్ చమురు వదులుకుంటే భారత్‌కు 11 బిలియన్ డాలర్ల భారం
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తే భారత్ ఏటా 9-11 బిలియన్ డాలర్లు మేర నష్టాన్ని భరించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా సుంకాల పెంపు, జరిమానాల కారణంగా భారత్‌కు కొత్త చిక్కులు తప్పేలా లేవు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. శనివారం కూడా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తోందంటూ ఏకపక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సుంకాలు, ఇతర వాణిజ్య పరిణామాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తే భారత్ ఏటా 9-11 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 78,000-92,000 కోట్ల) మేర నష్టాన్ని భరించాల్సి ఉంటుందని కెప్లర్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే ముడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్ 2022 నుంచి డిస్కౌంట్ లభిస్తున్న కారణంగా రష్యా నుంచి ముడిచమురు కొనుగోను గణనీయంగా పెంచింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు 0.2 శాతం కంటే తక్కువగా ఉన్న రష్యన్ చమురు వాటా,ఇప్పుడు 35-40 శాతానికి పెరిగింది. భారత్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంతో ఖర్చులను తగ్గించింది. దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వీలు కుదిరింది. అంతేకాకుండా రష్యా చమురును వద్దనుకున్న దేశాలతో సహా పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా భారత్ రికార్డు లాభాలను సాధించింది.
అయితే, తాజా పరిణామాలు భారత్‌కు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా రెండు సమస్యలు.. మొదటిది అమెరికా జరిమానా ముప్పు కాగా, రెండవది రష్యా ముడి చమురు నుంచి శుద్ధి చేసిన ఉత్పత్తులను 2026, జనవరి నుంచి ఈయూ నిషేధం విధించడం. ఇవి రెండింటి ఒత్తిడి కారణంగా భారత్ ముడి చమురు కొనుగోలును తగ్గించనున్నాయి. ఫలితంగా వ్యయ భారం ముదరవచ్చని కెప్లర్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2023-24లో భారత్ ముడి చమురు దిగుమతుల కోసం 137 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 12 లక్షల కోట్లు) ఖర్చు చేసింది. రష్యన్ చమురు నిలిపేసి మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లతో భర్తీ చేయడం వల్ల చమురు బిల్లు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రోజుకు 18 లక్షల బ్యారెళ్ల చొప్పున బ్యారెల్‌కు 5 డాలర్లు(రూ. 436) కోల్పోతే, భారత్ చమురు బిల్లుపై ఏటా 9-11 బిలియన్ డాలర్ల భారం తప్పదని కెప్లర్‌లో లీడ్ రీసెర్చ్ అనలిస్ట్ (రిఫైనింగ్ అండ్ మోడలింగ్) సుమిత్ రిటోలియా వివరించారు. సరఫరాను కఠినతరం చేయడం వల్ల ప్రపంచ చమురు ధరలు పెరిగితే, ఖర్చుల భారతం ఇంకా పెరిగే అవకాశాలుంటాయని పేర్కొన్నారు.






