Gold Price: బంగారం ఆల్‌టైమ్‌ రికార్డు..తగ్గడం కష్టమేనా.. నిపుణులు ఏమంటున్నారు?

by Vennela |

Gold Price: బంగారం(Gold) పేరు వింటేనే కరెంట్ షాక్ కొట్టినంత పనైతుంది

Gold Price: బంగారం ఆల్‌టైమ్‌ రికార్డు..తగ్గడం కష్టమేనా.. నిపుణులు ఏమంటున్నారు?
X

దిశ, వెబ్ డెస్క్: Gold Price: బంగారం(Gold) పేరు వింటేనే కరెంట్ షాక్ కొట్టినంత పనైతుంది. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులను భయపెడుతున్నాయి. దీంతో తొలిసారి తులం బంగారం ధర రూ. 83వేల మార్క్ దాటేసింది. ఈ ప్రభావం కొనుగోలుదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరి బంగారం ధరలు తగ్గుతాయా? తగ్గితే ఎప్పుడు తగ్గుతాయి? బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

బంగారం ధరలు(Gold Price) భారీగా పెరుగుతున్నాయి. రోజురోజు పెరుగుతున్న ధరలు పసిడి ప్రియులను భయపెడుతున్నాయి. కొత్త ఏడాదిలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విజయం సాధించిన తర్వాత బంగారం ధరలు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ అనిశ్చితి నెలకొంది. దీంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర 24 క్యారెట్లకు రూ. 83వేల మార్క్ దాటేసింది. 83వేలు దాటడం ఇదే తొలిసారి.

శుక్రవారం నాటి ఎంసీఎక్స్(MCX) ట్రేడింగ్ లో 99.9 స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 83,100కిచేరిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. ఇక 99.5 శాతం స్వచ్చతమైన బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 82,700 చేరింది. ఇక వెండి కూడా నేడు రూ. 500 పెరిగి ఢిల్లీ మార్కెట్లో 94వేలకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర చూస్తే ఔన్సు బంగారం ధర 2780 డాలర్లకు చేరుకుంది. వెండి ధర ఔన్సుకు 31.32 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.

అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పట్లో బంగారం ధరలు దిగివచ్చే అవకాశం కనిపించడం లేదని బులియన్ మార్కెట్ నిపుణులు(Bullion Market Experts) అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టారిఫ్ విషయంలో ఎలా వ్యవహరిస్తారనే అంశంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఎన్నికల సమయంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే విధంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇతర అంశాల్లోనూ ఎలా వ్యవహరిస్తారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. దీంతో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గుచూప్తున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడి పాలసీ నిర్ణయాలు వెలువడే వరకు బంగారం ధరల తగ్గుదలపై ఓ అంచనాకు రాలేమని వెల్లడించారు.

ఇక అటు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టునున్న బడ్జెట్, అమెరికా ఫెడరల్ రిజర్వ్(America's Federal Reserve) వడ్డీ రేట్ల నిర్ణయాలు భవిష్యత్తు రోజుల్లో బులియన్ మార్కెట్లో(Bullion Market) పసిడి ధరలను నిర్ణయిస్తుందని నిపుణులు అంటున్నారు. బడ్జెట్లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే దేశీయంగా బంగారం ధర మరింత ప్రియం కానుంది. గత ఏడాది జులై బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ(Customs duty in the budget)ని 9శాతం తగ్గింది కేంద్ర ప్రభుత్వం. దీంతో దిగుమతులు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఈ ప్రభావం దేశ వాణిజ్య లోటుపై పడింది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఇప్పుడు సుంకాలు పెంచక తప్పదని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. బంగారంపై కస్టమ్స్ డ్యూటీ(Customs duty)ని పెంచినట్లయితే బంగారం ధర మరింత పెరగనుంది.

Next Story