ఆయిల్‌ పామ్‌ సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్తు: మంత్రి హరీష్ రావు

by  |
harish rao
X

దిశ సిద్దిపేట: ఆయిల్ పామ్ సాగుకు.. సిద్ధిపేట జిల్లా లాభదాయకం శ్రేయస్కరమని, అంతర్జాతీయ డిమాండ్ ఉన్న పంట ఆయిల్ పామ్ సాగని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆయిల్‌ పామ్‌ సాగుతో జిల్లా రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని, మొదటి ప్రాధాన్యత కింద ఆయిల్ పామ్ మొక్కలు పంపిణీ చేయాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. గురువారం సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగు హార్టికల్చర్ గెస్ట్ హౌస్ నుంచి సిద్ధిపేట జిల్లా వ్యవసాయ, ఉద్యాన పట్టు పరిశ్రమ, ఆయిల్ ఫెడ్ అధికారులతో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, వ్యవసాయ విస్తరణ అధికారులు AEO క్లస్టర్ వారీగా ఆయిల్ పామ్, మల్బరీ తోటల సాగు లక్ష్యాలను నిర్దేశించారు.

రానున్న 15 రోజుల్లో ఎంపిక చేసిన రైతులకు 1100 ఎకరాలకు మాత్రమే ప్రస్తుతానికి ఆయిల్ పామ్ మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ముందుగా వచ్చిన వారికే మొదటి ప్రాధాన్యంగా ఈ మొక్కలను పంపిణీ చేయాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి జిల్లాలో 2100 ఎకరాల ఆయిల్ పామ్ ప్లాంటేషన్ సాగు చేసి, అంతర పంటలు వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారని, ఆయిల్ ఫామ్ సాగు కోసం వంద శాతం రాయితీపై ఎస్సీ, ఎస్టీలకు డ్రిప్ అందిస్తున్నట్లు, 90 శాతం రాయితీపై డ్రిప్ అందిస్తూ మొక్కలతో పాటు 4 ఏళ్లు యాజమాన్యం కోసమై 1100 ఎకరాలకు అందుబాటులో పెట్టడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయదని, రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన క్రమంలో యాసంగిలో వరి పంట సాగు చేయడం శ్రేయస్కరం కాదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని స్పష్టం చేసారు.

వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు అందరూ దీర్ఘకాలిక పంటలపై రైతులతో అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ఆయిల్ ఫామ్ సాగుపై పూర్తి స్థాయిలో వివరించి 15 రోజుల్లోపు 1100 ఎకరాల ప్లాంటేషన్ పూర్తి చేయించాలని మంత్రి కోరారు. అదే విధంగా సెరికల్చర్ సాగుకై భార్యాభర్తలు కలిసి పని చేసుకునే కుటుంబాలను గుర్తించి, వారి ద్వారా జిల్లాలో షెడ్, పట్టు పురుగులను రాయితీపై అందిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. ఈ పంటల సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం వస్తుందని తద్వారా ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు. జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు తమ తమ క్లస్టర్ పరిధిలోని రైతులతో సమావేశం నిర్వహించి , చైతన్యం చేసి ఆయిల్ ఫామ్ సాగు, మల్బరీ తోటల సాగు కోసమై రైతులు ముందుకు వచ్చేలా చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.



Next Story