కరోనా ఉన్నా.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!

by  |
కరోనా ఉన్నా.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘షరతులు వర్తిస్తాయి’ అనే ట్యాగ్‌లైన్‌తో కరోనా కాలంలో ఎన్నో పెళ్లిళ్లు జరిగాయి. ‘ఆన్‌లైన్‌లో రింగులు మార్చుకోవడంతో పాటు కరోనా వార్డులో మనసులు కలిసిన సందర్భాలు, బంధం ముడిపడిన సంఘటనలున్నాయి. ఈ క్రమంలోనే ఐసోలేషన్‌లో ఉన్న ఓ అమ్మాయి, తనకు నచ్చిన అబ్బాయిని వినూత్నంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికింది. మరి ఆ పెళ్లి తంతు ఎలా జరిగిందంటే?

కాలిఫోర్నియాకు చెందిన పాట్రిక్ డెల్గాడో, లారెన్ జిమెనెజ్‌ తమ జీవితంలోని ‘బిగ్ డే’ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇక మరో మూడు రోజుల్లో తమ బంధం ముడిపడుతున్న సమయంలో లారెన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. పాండమిక్ కారణంగా అప్పటికే మూడు సార్లు తమ పెళ్లి వాయిదా పడటంతో ఆమె చాలా బాధపడింది. కానీ ఈసారి మాత్రం కరోనాకు ఆ చాన్స్ ఇవ్వకూడదనుకున్న లారెన్‌.. అనుకున్న రోజునే పెళ్లి జరగాలని కోరుకుంది. తన మనసులోని మాటను పాట్రిక్‌తో పంచుకోగా, అందుకు అతను కూడా ఒప్పుకున్నాడు. వారి ఆలోచనకు డిస్నీ మూవీ ‘టాంగ్లెడ్’ స్ఫూర్తిగా నిలిచింది. ఈ క్రమంలో లారెన్‌ ఉంటున్న క్వారంటైన్‌ రూమ్ కిటికీనే ‘పెళ్లి వేదిక’గా మారింది. ఫ్లోర్ మొత్తాన్ని పూలకుండీలతో అందంగా మార్చారు. లారెన్‌ పెళ్లి గౌనులో అందంగా ముస్తాబు కాగా, వరుడు ఆ కిటికీ కిందున్న లాన్‌లో తన ఇష్టసఖిని పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నాడు. పాట్రిక్ ఆమె చేయి పట్టుకుని, కాదు కాదు.. ఓ రిబ్బన్ సాయంతో ఆమెకు రింగ్ పంపించగా, దాన్ని ఆమె తన వేలికి పెట్టుకోవడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు.

కరోనా కావడంతో, పది మంది అతిథుల సమక్షంలో పాట్రిక్, లారెన్‌లు పెళ్లి చేసుకోగా.. వాళ్లంతా కూడా తమ తమ కార్లలోనే ఉండి వధూవరులను ఆశీర్వదించారు. ‘పాట్రిక్ నా జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. కష్టకాలంలో నా వెంట నిలిచి, నన్ను సంతోషపెట్టాడు. తన రాకతో నా జీవితం మరో కొత్త మలుపు తీసుకుంది. మా క్వారంటైన్ పెళ్లి నిజంగా ఓ అద్భుతం. ఈ భిన్నమైన పెళ్లిని మాకు పుట్టబోయే పిల్లలకు, రాబోయే మనవళ్లతో ఆనందంగా చెప్పుకుంటాం’ అని లారెన్ పేర్కొంది. ఈ సెర్మనీకి ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించిన జెస్సికా జాక్సన్.. తన ఇన్‌స్టాలో వీరి ఫోటోలతో పాటు వారి క్వారంటైన్ పెళ్లి తంతును పంచుకోగా, అది వైరల్‌గా మారింది.


Next Story

Most Viewed