న్యాయం గెలవాలంటున్న నరేష్

by  |
న్యాయం గెలవాలంటున్న నరేష్
X

దిశ, వెబ్‌డెస్క్ : అల్లరి నరేష్ పేరు వినగానే మనకు కామెడీయే గుర్తొస్తుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో కామెడీ మూవీస్‌తో అనేక జయాలను అందుకున్నప్పటికీ, తనలోని నటుడిని సంతృప్తిపరుచుకునే సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. ‘గమ్యం, శంభో శివ శంభో, విశాఖ ఎక్స్‌ప్రెస్’.. ఇలా చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే నరేష్‌కు గుర్తుండిపోయే పాత్రలు దక్కాయి. కొంతకాలంగా తను హీరోగా చేస్తున్న సినిమాలన్నీ వరుసగా ఫ్లాఫ్ అవుతుండటంతో ప్రస్తుతం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు నరేష్. ఈ క్రమంలోనే ‘నాంది’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘నాంది’ చిత్ర టీజర్ అప్పట్లోనే మంచి ఆసక్తిని కలిగించింది. తాజాగా ‘బ్రీత్ ఆఫ్ నాంది’ పేరుతో సాయి ధరమ్ తేజ్ మరో టీజర్ రిలీజ్ చేశాడు.

‘15 లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే గానీ మన దేశానికి స్వాతంత్ర్యం రాలేదు. 1300 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకుంటే కానీ ఓ కొత్త రాష్ట్రం ఏర్పడలేదు. ప్రాణం పోకుండా న్యాయం గెలిచిన సందర్భం చరిత్రలోనే లేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు.. న్యాయం గెలవాలి, న్యాయం గెలవాలి’ అంటూ పోలీసుల చెరలో ఉన్న అల్లరి నరేష్ చెబుతున్న సంభాషణలు సినిమాపై ఇంట్రెస్ట్‌ను మరింత పెంచాయి. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ప్రియదర్శి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేశ్న నాంది చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.


Next Story

Most Viewed