బలమైన పార్టీగా అవతరించడమే బీజేపీ వ్యూహం..!

by  |
బలమైన పార్టీగా అవతరించడమే బీజేపీ వ్యూహం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగేందుకు బీజేపీ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే జాతీయస్థాయి నాయకులను రప్పించి నగర వాసుల్లో బీజేపీ వాదనను స్పష్టంగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న లీడర్లు పార్టీని బలపరచకపోగా మరింత బలహీనపరిచారని కాషాయ పార్టీ అధిష్టానం భావించినట్లు పార్టీ వర్గాల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నాయకులకు జాతీయ స్థాయి బాధ్యతలను అప్పగించి, ఇక్కడ కొత్తవారికి నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. కిషన్ రెడ్డిని ఎంపీగా, డా. లక్ష్మణ్ ను ఓబీసీ అధ్యక్షుడిగా పంపించారు. మురళీధర్ రావు మధ్యప్రదేశ్ ఇన్‌చార్జీగా ప్రకటించింది. బీజేపీలోకి కొత్తగా చేరిన డీకె అరుణకు జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తును ఆర్ఎస్ఎస్ భావాలున్న బండి సంజయ్ చేతుల్లో పెట్టింది. ఈ నేపథ్యంలోనే దుబ్బాక ఉపఎన్నిక ప్రకటించడం, అందులో బండి సంజయ్ సక్సెస్ కావడం, నెలరోజుల వ్యవధిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడం, బండి సంజయ్ తన జాతీయ భావాన్ని గట్టిగా వినిపించడం, ప్రజల్లో రోజురోజుకూ బీజేపీపై ఆదరణ పెరగడాన్ని గుర్తించింది.ఈ ఆదరణను ఓటింగ్ వరకు కొనసాగించేలా కొత్త ప్రయోగాలు, ప్రణాళికలు రచిస్తూ వస్తోంది.

బీజేపీపై భరోసా కల్పించేందుకు..

నగరవాసుల్లో బీజేపీ పట్ల విశ్వసనీయతను పెంచాలని, తద్వారా వారు పార్టీని బలపరిచేలా ప్రణాళికలు చేసింది. స్థానికంగా బీజేపీకి అభిమానం, మద్దతు ఉన్నా వారికి గత నాయకత్వం భరోసాను కల్పించలేదు. అందుకే గత ఎన్నికల్లో బీజేపీ తన ఉనికిని కోల్పోయింది. ఈ క్రమంలోనే గతంలో 5 గురు ఎమ్మెల్యేలు ఉన్నా బీజేపీ ముందస్తు ఎన్నికల్లో 4 సీట్లను కోల్పోయి ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. మొన్న బీజేపీ నుంచి రాజాసింగ్ ఒక్కరే గెలవడాన్ని గుర్తించిన అధిష్టానం ఓటమికి గల కారణాలను అంచనా వేసింది. ఇప్పటి వరకు పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉన్నా దానిని పార్టీకి అన్వయించడంలో నాయకత్వం సఫలం కాలేదని తేలింది. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ప్రధాన మంత్రి మోడీ పరిపాలనపై ఉన్న నమ్మకంతో ప్రజలు తెలంగాణలో 4 ఎంపీ సీట్లను కట్టబెట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన కషాయ అగ్రనాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని మార్చింది. ఎలాగైన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన శక్తిగా అవతరించాలనేది బీజేపీ అగ్రనేతల వ్యూహంగా తెలుస్తోంది. అందుకే మెజారిటీ సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో అధికారపార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఉండాలని బలమైన సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది. ఆ దిశగా సాగించిన ప్రయత్నాలు కొంతమేర ఫలితాలు ఇచ్చినట్లు మొన్న వెలువడిన దుబ్బాక రిజల్ట్స్ స్పష్టంచేశాయి.

సంచలన ప్రకటనలు..

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ వైఫల్యాలను గుర్తించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధికార పార్టీ పనితీరును ప్రజల్లో ఎండగడుతున్నాడు. అందుకు జాతీయ నాయకత్వం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. ఫలితంగా గ్రేటర్‌లో బీజేపీకి విపరీతమైన ఫాలోయింగ్ వస్తోంది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం ప్రజలు బీజేపీ గురించి మాట్లాడుకుంటున్నారు. దీంతో పార్టీని మరింత ప్రజాబాహుల్యంలోనికి తీసుకెళ్లేందుకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రోజుకో కొత్త అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. మొదట వరద సాయం- డబుల్ బెడ్ రూంలు, బీజేపీ ఫోర్జరీ లెటర్ హెడ్, భాగ్యలక్ష్మి దేవాలయం, రోహింగ్యాలు- చొరబాటుదారులు, సర్జికల్ స్ట్రైక్, పీవీ, ఎన్టీఆర్ సమాధులు- దారుస్సలాం, శాంతిభద్రతలు, సీఎం అవినీతి, కేసీఆర్ జైలుకెళ్లడం, మధ్యంతర ఎన్నికలు, నిజాం షాహి, రజాకర్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భవ వంటి విషయాలు నగర వాసుల్లో కొత్త ఆలోచనలకు తెరలేపాయి. అప్పుడప్పుడు అధికార పార్టీ ప్రకటనలపై కౌంటర్ అటాక్ చేయడంతో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా, డిసెంబర్ -4న వెలువడనున్న గ్రేటర్ ఫలితాల్లో బీజేపీ ఎంతమేర సక్సెస్ కానుందో తెలిసే అవకాశం ఉంది.



Next Story