బండి ఫాస్ట్ గా వెళ్తే ఆ రోడ్డు మోడీ వేసినట్టు.. వెళ్లకపోతే అది రాష్ట్ర ప్రభుత్వం వేసినట్టు

by  |
GVL-
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు.2024 ఎన్నికల్లో టీడీపీకి పోటీ చేసే సత్తా లేదని విమర్శించారు. వైసీపీకి బీజేపీయే ప్రత్యర్థి పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా గురజాల ఆర్డీవో ఆఫీస్ ఎదుట బీజేపీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెత్త మీద విధించిన పన్ను, తొలగించిన పెన్షన్లపై నిరసనగా బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కనుమరుగైంది అని ఎన్నికలంటే ఏదో ఒక కుంటి సాకు చెప్పి పోటీ చేయకుండా తప్పుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రజావ్యతిరేక పాలనను ప్రశ్నిస్తూ ప్రధాన ప్రతిపక్షం పోషించే ఏకైక పార్టీ బీజేపీయేనని చెప్పుకొచ్చారు.

వైసీపీ నేతలను ధీటుగా ఎదుర్కొని ఎన్నికల్లో పోటీచేసే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని.. ఏ ఒక్క ఎన్నిక నుంచి తప్పుకునే ప్రసక్తేలేదని జీవీఎల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని ప్రధానమంత్రి మోదీ వేసిన రోడ్డుకి రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్డుకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. రోడ్డుపై సాఫీగా వెళుతుంటే అది మోడీ వేసిన రోడ్డు అని.. గుంతలు గతుకుల రోడ్డుపై వెళుతుంటే అది రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్డు అని స్పష్టంగా తెలుసుకోవచ్చని జీవీఎల్ స్పష్టం చేశారు. గత ఆరు నెలల నుండి రోడ్ల నిర్మాణానికి రూ. రెండు వేల కోట్లు విడుదల చేశామని.. కాంట్రాక్టులు పిలుస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందే తప్ప అసలు పనులు జరగడం లేదన్నారు. కాంట్రాక్టు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వసనీయత లేకుండా పోయిందన్న జీవీఎల్ . ప్రభుత్వానికి పని చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.

Next Story

Most Viewed