హుజూరాబాద్‌లో బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్‌లోకి కౌన్సిలర్లు

by  |
హుజూరాబాద్‌లో బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్‌లోకి కౌన్సిలర్లు
X

దిశ, హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితంగా బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. హుజూరాబాద్ మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. మొన్న 18వ వార్డు కౌన్సిలర్ ప్రతాప మంజుల బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరగా.. మంగళవారం 20వ వార్డు కౌన్సిలర్ గనిశెట్టి ఉమామహేశ్వర్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితంగా బీజేపీ పార్టీ నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు సైతం కండువాలు మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ట్రబుల్ షూటర్ హరీష్ రావు హుజూరాబాద్‌లో పాగా వేసిన అనంతరం రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత కొద్ది రోజుల పాటు సిద్దిపేట నుంచే చక్రం తిప్పిన హరీష్ రావు హుజూరాబాద్‌ వచ్చిన తర్వాత రాజకీయ ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చేశారు. హరీష్ రావు దెబ్బకు ఈటల రాజేందర్ శిబిరం పూర్తిగా ఖాళీ అయింది. మరో కొంత మంది ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు ఒక్కరో ఇద్దరో ప్రజాప్రతినిధులు మినహా ఈటల వెంటే నడిచే వారే లేరంటే పరిస్థితి ఎలా మారిందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

త్వరలో టీఆర్ఎస్‌లో చేరనున్న మరో కౌన్సిలర్..?

హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఐదుగురు కౌన్సిలర్లు గెలువగా ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత 18, 20వ వార్డు కౌన్సిలర్లు చేరగా.. మరో రెండు రోజుల్లో ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు సైతం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీజేపీ కౌన్సిలర్ ఉమామహేశ్వర్ టీఆర్ఎస్ గూటికి చేరారు.


Next Story

Most Viewed