గులాబీ, కమలం దొందు దొందే!

by  |
గులాబీ, కమలం దొందు దొందే!
X

దిశ, భద్రాచలం : ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చర్లలో టీఆర్ఎస్ (గులాబీ), బీజేపీ (కమలం) పార్టీలలో వర్గపోరు బహిర్గతమైంది. ఆ రెండు పార్టీల్లో నాయకుల నడుమ విభేదాలు, గ్రూపు రాజకీయాలు అధిష్టానాలకు పెద్ద తలనొప్పిగా తయారైనాయి. అధికార పార్టీల నాయకుల నడుమ అనైఖ్యత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేలు చేస్తుందా లేక కీడు చేస్తుందా అనే భయాందోళనలు ఆయా పార్టీల క్యాడర్‌లో కనిపిస్తోంది. పట్టభద్రుల దగ్గరకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నాయకులు రెండు గ్రూపులుగా వెళుతుండగా ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ఓటర్ల దగ్గరకు వెళ్లి ఎవరికీ మాట ఇవ్వకండి మళ్లీ వచ్చి కలుస్తాం అని రెండు గ్రూపుల వాళ్లు చెబుతుండడంతో ఇందులో ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో అర్థంగాక ఆరా తీస్తున్నారు.

రెండు గ్రూపులుగా కేసీఆర్ బర్త్ డే..

టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను ఈనెల 17న చర్లలో నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి చేయడం గమనార్హం. పార్టీ సభ్యత్వాల నమోదు విషయంలోనూ నాయకుల నడుమ తీవ్రమైన విభేదాలు ఉన్నట్లు సమాచారం. పార్టీలో గ్రూపుల‌ మూలంగా గతంలో జరిగిన నష్టాన్ని తలుచుకొని క్యాడర్ భయపడుతోంది. గ్రూపు‌ గొడవల వల్లనే 2018 అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన చర్ల మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి వ్యతిరేక ఫలితాలు వచ్చాయనేది జగమెరిగిన సత్యం. మళ్లీ ఇపుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో అవే గ్రూపులు బహిర్గతమవడంతో గులాబీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.‌ నాయకుల‌ నడమ పంతాలు, పట్టింపులు పార్టీకి ఖచ్చితంగా నష్టం చేస్తాయని టీఆర్ఎస్ కార్యకర్తలు భయపడుతున్నారు.

గ్రూపు లీడర్ల ఆధిపత్యం ఆరాటం..

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య లేదా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వంటి పార్టీ పెద్దలు చర్ల మండల పర్యటనలకు వచ్చినపుడు నేతలు తమ గ్రూపు ఆధిపత్యం కోసం పాట్లుపడుతుంటారు. పార్టీ పెద్దలకు వీర విధేయులం అన్నట్లుగా వచ్చిన వారికి జై కొడు తూ పెద్దపెట్టున నినాదాలు చేస్తారు. అంతేగాకుండా మరో ఆశ్చర్యం ఏ మంటే పాతవాళ్ళనే కొత్తవాళ్లుగా పరిచయం చేస్తూ పెద్దల ముందు బల ప్రదర్శనలు చేస్తుంటారు. సందు దొరికితే వైరి నేతల వైఖరిపై పితుర్లు చెబుతుంటారు.‌ మేమే పార్టీ కోసం పనిచేసే వాళ్లం అన్నట్లుగా తెగ ఫీలింగ్స్ ఇస్తారు. అయితే ఇక్కడికి వచ్చిపోయే పార్టీ పెద్దలు కూడా ఫేస్, న్యూట్రల్ ఉంటేనే బల్బ్ వెలుగుద్ది అన్నట్లుగా ఎవరినీ నొప్పించక ఇద్దరిని సమంగానే చూస్తున్నట్లుగా మేనేజ్‌ చేసి తమ పని ముగించుకొని వెళ్లిపోతారు. ఎప్పుడు ఎడముఖం, పెడముఖంగా కనిపించే నాయకుల మూలంగా కింది స్థాయి క్యాడర్, పార్టీ కార్యకర్తలు మథనపడుతున్నారు. సాధారణ సమయంలో గ్రూపుల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సమన్వయం చేయకపోతే ప్రత్యర్థి పార్టీలకు అదే అందివచ్చిన అవకాశం‌ అవుతుందని పార్టీ శ్రేణులు భయపడుతున్నారు. పార్టీలో గ్రూపులు ఎలక్షన్ సమయంలో పబ్లిక్‌లో తప్పుడు సంకేతాలు ఇస్తాయని అభిమానులు ఆందోళన చెందుతున్పారు

బీజేపీలో నేతల మధ్య విభేదాలు..

క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకొనే బీజేపీలో కలహాలు మొదలైనాయి. పెద్ద నాయకత్వం పెట్టిన చిచ్చు క్రమేపి రగులుతోంది. ఫలితంగా చర్ల మండల నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారు. ఇటీవల చర్లలో జరిగిన పోడు గర్జన బహిరంగ సభలో పాల్గొనడానికి వచ్చిన బీజేపీ జాతీయ నాయకులు పొలసాని మురళీధర్‌రావు ముందు వేదికపైనే ఓ వర్గం ఆధిపత్య ధోరణి, మరోవర్గం అసంతృప్తి వైఖరి ప్రదర్శించడంతో మండలంలో పార్టీ మనుగడ పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. నాయకత్వం తీరు పార్టీకి నష్టమని సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసింది. స్వప్రయోజనాల కోసం పైస్థాయి వ్యక్తి ఒకరు కొందరిని చేరదీసి ప్రోత్సహిస్తూ, మరికొందరిని పార్టీ నుంచి బలవంతంగా బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కమలం టీమ్‌లో విమర్శలు వినిపిస్తున్నాయి. అకారణంగా, ఏకపక్షంగా చర్ల మండల కమిటీ రద్దు ప్రకటన వెనుక ఆంతర్యం అదే అనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమౌతోంది. అయితే ప్రత్యర్థివర్గం దానిని సమర్థిస్తోంది. ఎవరూ ముందుకు రానపుడు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టి గ్రామస్థాయిలోకి తీసుకెళ్ళిన వారిని బయటకు పంపే చర్యలు పార్టీకి ఏ మేరకు మేలు చేస్తాయని కమలం అభిమానులే ప్రశ్నిస్తున్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం వివిధ పార్టీలలోని అసంతృప్తులు, తటస్థుల చూపు కమలం వైపు పడుతోంది. పార్టీ బలపడుతున్న సమయంలో చర్ల నేతలు పంతాలు, పట్టింపులతో గ్రూపులు కట్టి పార్టీని నష్డం చేస్తున్నారని సీనియర్లు, అభిమానులు మథనపడుతున్నారు.‌ ఇప్పటికైనా పై కమిటీలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.



Next Story