బోర్ కొట్టిస్తున్న బిగ్‌బాస్

by  |
బోర్ కొట్టిస్తున్న బిగ్‌బాస్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్‌లో పది మంది తెలివితక్కువ వాళ్లు ప్రైజ్ మనీ కోసం వంద రోజులు పోటీపడతారు, అదే చదువుకున్న ఒక్క వ్యక్తి కేబీసీ కార్యక్రమంలో పది ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అరగంటలో అదే ప్రైజ్ మనీని గెలుస్తాడు. అందుకే చదువు అవసరం అని ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక మీమ్ వైరల్ అయింది. అయితే మరి బిగ్‌బాస్‌కు వెళ్లడానికి ఓవర్ నైట్‌లో పాపులర్ అయిపోతే సరిపోతుంది, కానీ చదువుకోవడానికి సంవత్సరాలు గడపాలంటూ కొందరు కౌంటర్ ఇచ్చారనుకోండి. ఎంత మంది తిట్టినా, అవమానించినా బిగ్‌బాస్ కార్యక్రమానికి ఉన్న క్రేజే వేరు. కానీ ఈ బిగ్‌బాస్ 4 మాత్రం ఎందుకో ఈ మధ్య బోర్ కొట్టిస్తున్న ఫీలింగ్ వస్తోంది.

అవే ఆటలు, గతంలో ఇచ్చిన టాస్క్‌లే మళ్లీ ఇవ్వడం, ఒకే రకమైన సీక్రెట్ టాస్క్‌లు, అందరూ సేఫ్ గేమ్ ఆడుతుండటం, కంటెస్టంట్లే నామినేషన్‌లు, ఎలిమినేషన్‌ల గురించి మాట్లాడుతుండటం, ఏదో స్క్రిప్ట్ ఇచ్చినట్లుగా బిహేవ్ చేస్తుండటం ఇవన్నీ చూస్తోంటే చాలా బోర్‌గా అనిపిస్తోంది. ఎంటర్‌టైన్ చేసే వాళ్లు అనూహ్యంగా ఎలిమినేట్ అవడంతో ఇంట్లో ఉన్న అందాలన్నీ పోయి స్క్రాప్ మిగిలిన ఫీలింగ్ వస్తోంది. ఈసారి గట్టిగా ఎదురుచెప్పే ఒక్క కంటెస్టెంట్ లేడు, గ్రూపిజం లేదు… ఇలా బిగ్‌బాస్ కార్యక్రమానికి ఉండాల్సిన ఆస్థాన హంగులేవీ లేకపోవడంతో ప్రేక్షకులకు రుచించడం లేదు. మొన్నటి వరకు ప్రచ్ఛన్న యుద్ధం చేసుకున్న అభిజిత్, అఖిల్ కూడా ఇప్పుడు ఏకమవడంతో షో మరింత బోరింగ్‌గా మారింది. అరియానా క్లారిటీ, సొహైల్ కోపం, అవినాష్ చిరాకు, మోనల్ వెర్రితనం, లాస్య అమాయకత్వం, అమ్మ రాజశేఖర్ పగ, హారిక గందరగోళం, మెహబూబ్ ఓవర్ యాక్షన్… ఇలా వారి వారి ప్రవర్తనలకు ఒక బ్రాండ్ పడిపోవడంతో ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. బిగ్‌బాస్‌ను రెగ్యులర్‌గా రివ్యూ చేసే వాళ్లకు కూడా చిరాకు వచ్చే స్థాయికి కార్యక్రమం దిగజారింది. ఇలాగే కొనసాగితే మంచి టీఆర్‌పీతో ప్రారంభమైన ఈ కార్యక్రమం చివరకు వచ్చేసరికి దారుణమైన టీఆర్‌పీకి పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.


Next Story

Most Viewed