కార్మిక శాఖలో భారీ అవినీతి.. ఏసీబీ విచారణకు మాజీ ఉద్యోగి డిమాండ్

by  |
కార్మిక శాఖలో భారీ అవినీతి.. ఏసీబీ విచారణకు మాజీ ఉద్యోగి డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కార్మిక శాఖలో మరోసారి భారీ అవినీతి ఆరోపణలు వెలుగుచూశాయి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు ‘సెస్’ రూపంలో వెళ్ళాల్సిన నిధులు గోల్‌మాల్ అయ్యాయని ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో పదవి విరమణ పొందిన ఓ ఉద్యోగి.. ఏడేళ్ళుగా ఈ తతంగం జరుగుతూనే ఉన్నదని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు నుంచి ఈ ఆరోపణలు ఉన్నాయన్నారు. అయినా, ఉన్నతాధికారులు పట్టించుకోలేదని లోగుట్టును బయటపెట్టారు. ఇప్పటికైనా ఈ అవినీతి ఎంతమేర కూరుకుపోయిందో వెలికితీయడానికి ఏసీబీతో సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిందిగా కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదినికి రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ రాజేందర్ తాజాగా లేఖ రాశారు. ఈ అవినీతి భాగోతం సుమారు రూ. 100 కోట్ల మేర ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.

కార్మిక శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నప్పుడు తాను 2014లో రాష్ట్రం ఏర్పడకముందే లేఖ రాశానని, కానీ ఉన్నతాధికారులు దీని గురించి పట్టించుకోలేదని, ఆ తర్వాత 2019లో విజిలెన్స్ కమిషన్ సైతం దీనిపై సమగ్రమైన నివేదికను కోరిందని అన్నారు. కానీ ఆ శాఖ ఉన్నతాధికారులు పట్టీ పట్టనట్లుగానే ఉన్నారని ఆ లేఖలో రాజేందర్ గుర్తుచేశారు. కార్మిక సంక్షేమం కోసం చట్టప్రకారం చెల్లించాల్సిన ‘సెస్’ను ఎగవేసినవారిపై చర్యలు తీసుకోవాలని, వారి నుంచి రెండు శాతం వడ్డీతో వసూలు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 60 రిజిస్టర్డ్ సంస్థలు ఈ ఎగవేతకు పాల్పడినట్లు గుర్తుచేశారు. అవినీతి జరిగినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందున అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాణి కుముదినిని రాజేందర్ కోరారు.


Next Story

Most Viewed