భైంసా అల్లర్లు: రాజకీయ పార్టీలకు సవాల్

by  |

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: భైంసాలో ఇటీవల చోటు చేసుకున్న ఇరువర్గాల ఘర్షణ రాజకీయ పార్టీలకు బస్తీమే సవాలుగా మారింది. వివిధ పార్టీలు మూడు ముక్కలాటగా మారగా ఈ వివాదానికి మీరంటే మీరే కారణమంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. అటు బీజేపీ, ఇటు ఎంఐఎం, మధ్యలో సర్కారు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇప్పటికే బీజేపీ, ఎంఐఎం పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోగా నష్ట నివారణ చర్యలపై సర్కారు దృష్టి పెట్టింది. భైంసా అదనపు ఎస్పీ ఖారే కిరణ్ ప్రభాకర్​ ను నియామకం చేయగా శాంతిభద్రతల పరిస్థితి అదుపులోనే ఉంది.

బీజేపీ-ఎంఐఎం రాజకీయ వార్..

భైంసా ఘటనలో తమ వారినే లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవికి ఇటీవల బెదిరింపు కాల్స్ రావటం సంచలనంగా మారింది. ఘటన వెనుక ఎంఐఎంతో పాటు బయటి శక్తుల హస్తం ఉందని విమర్శిస్తున్నారు. మరోవైపు కొందరు వ్యక్తులు, పార్టీల వారు తమను అనవసరంగా బద్నాం చేస్తున్నారని ఎంఐఎం పేర్కొంటోంది. కాగా, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మాత్రం వివాదాలు, విమర్శలకు వెళ్లకుండా కేవలం పరామర్శలకే పరిమితమయ్యారు.

రంగంలోకి సర్కారు.. నష్ట నివారణ చర్యలు

భైంసాలో తరచూ అల్లర్లు జరగటం, పదే పదే ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవటంతో రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. ఇప్పటికే మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భైంసాలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాలు సంయమనం పాటించాలని ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ఇన్​చార్జి ఎస్పీ విష్ణు వారియార్ భైంసాలోనే మకాం వేయగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తాజాగా భైంసాపై గట్టి నిఘా పెంచాలని ఐపీఎస్ అధికారిని నియమించింది. భైంసా సబ్ డివిజన్‍ అధికారిగా ఏఎస్పీ ఖారే కిరణ్‍ ప్రభాకర్‍ బుధవారం బాధ్యతలు స్వీకరించగా ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన కే.నర్సింగ్ రావును హైదరాబాద్ సీసీఎస్‍ కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో మొట్ట మొదటి సారిగా ఐపీఎస్‍ అధికారిని బైంసా సబ్ డివిజన్ కు నియమించారు.

అదుపులోకి వచ్చిన పరిస్థితి..

ఈ నెల 7న (ఆదివారం రాత్రి) భైంసా పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా 12 మందికి గాయాలైన విషయం తెలిసిందే. ఇందులో ప్రమేయం ఉన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన తర్వాత 144 సెక్షన్ అమలు చేయగా ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. దీంతో క్రమంగా ఆంక్షలు సడలిస్తున్నారు. ప్రస్తుతం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాపార, వాణిజ్య, వర్తక సముదాయాలు తెరిచేందుకు వెసులుబాటు కల్పించారు. రానున్న రోజుల్లో విడతల వారీగా ఆంక్షలు సడలించనున్నారు.

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed