స్కూల్ పిల్లలు పుల్ డ్రెస్‌లు ధరిస్తే బెటర్!

by sudharani |   ( Updated:2021-08-19 11:27:26.0  )
pull dress
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్కూల్ పిల్లలు మాస్కు, భౌతికదూరంతో పాటు పుల్ డ్రెస్‌లు ధరిస్తేనే ఆరోగ్యానికి మంచిదని హెల్త్ ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. పగటి పూట కుట్టే దోమల నుంచి రక్షణ పొందాలంటే శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు కప్పుకోవాలని వైద్యశాఖ పేర్కొన్నది. లేదంటే చిన్నారులకు కరోనాతో పాటు డెంగీ ముప్పు కూడా ఉన్నట్లు స్పష్టం చేసింది. పాఠశాలలు ప్రారంభించే ముందు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈ నిబంధనలను సూచించాలని వివరించింది. మూడు నెలల పాటు అర్బన్ ప్రాంతాల్లో డెంగీ, రూరల్‌లో మలేరియా ప్రభావం ఉండబోతున్నట్లు వెల్లడించింది. తప్పనిసరిగా చిన్నారులకు పగటి దోమ నుంచి రక్షణ కల్పించాలన్నది.

ప్రతీ పాఠశాలలో పరిశుభ్రతతో పాటు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నది. అంతేగాక కిటికీలు, డోర్లకు దోమ తెరలు లాంటి జాలీలు ఏర్పాటు చేసుకోవాలన్నది. మరోవైపు ప్రకృతి పదార్ధాలతో తయారు చేసిన దోమల నివారణ మందులను పాఠశాలల చుట్టూ స్ప్రె చేయాలన్నది. ఇప్పటికే ప్రభుత్వం సూచనతో వైద్యశాఖ కరోనాతో పాటు సీజనల్ వ్యాధుల నివారణకూ కృషి చేస్తుందని, కానీ ప్రజల సహకారం లేకుంటే నియంత్రణ సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పారు.

చిన్నారుల వ్యాప్తికి ఇదే అసలైన సమయం…

ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు వ్యాధుల వ్యాప్తి టెన్షన్ ప్రారంభం కానుంది. పాఠశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనాతో పాటు డెంగీ కూడా చిన్నారులపై దాడి చేసే అవకాశం ఉన్నది. సాధారణంగా డెంగీ జ్వరం దోమల వల్ల కలిగే వైరల్ వ్యాధి. ఏడిస్ దోమ కాటు ద్వారా డెంగీ వైరస్ మనుషులకు వ్యాపిస్తోంది. కానీ ఇది కేవలం పగటి పూట మాత్రమే కుట్టడంతో వ్యాధి వస్తుంది. స్కూళ్లు పనివేళలు డే టైంలోనే ఉన్న నేపథ్యంలో అందరి కంటే ఎక్కువగా విద్యార్థులకే డెంగీ ముప్పు ఉన్నదని అధికారులు చెబుతున్నారు. దీంతో స్కూళ్లు ప్రారంభం కాక ముందే విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ భయం నెలకొంది. మరోవైపు డెంగీ వ్యాధి కూడా అత్యధికంగా చిన్నారులపైనే దాడి చేస్తుందని జాతీయ సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి.

డెంగీ జ్వరం లక్షణాలు…

డెంగీ వైరస్ బారిన పడిన వారికి సాధారణంగా తీవ్ర స్థాయిలో జ్వరం వస్తుంది. తలనొప్పి భరించలేనట్లుగా వేధిస్తుంది. దీంతోపాటు కంటి నొప్పి, ఎముక, కండరాలు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉంటాయి. వికారంగా అనిపించడం, వాంతులు, చర్మంపై దద్దుర్లు వంటి ఇతర అనారోగ్యాలు ఎదురవుతాయి. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదం ఉండదు. సరైన సమయంలో చికిత్స అందిస్తే ఊపిరితిత్తులు, కాలేయం, గుండె వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. తద్వారా డెంగీ మరణాల రేటు కూడా తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.

నివారణ మార్గాలు….

దోమకాటుకు దూరంగా ఉండాలంటే నిద్రపోయేటప్పుడు దోమ తెరను ఉపయోగించాలి. శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలి. ఫుల్ హ్యాండ్ షర్టులు, పొడవైన ప్యాంటు ధరించడం మంచిది. నివాస ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా వృద్ధి చెందకుండా చూసుకోవాలి. పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి, వాటి సంతతిని పెంచుకుంటాయి. అందుకే ఇంటి చుట్టూ నీరు, డ్రైనేజీ నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అలా ఉంటే వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వాలి.

ప్రతి రోజూ సాయంత్రం 5 తర్వాత ఇంటి తలుపులు, కిటికీలు మూసివేయాలి. దోమలు సాయంత్రం వేళల్లోనే చురుగ్గా ఉంటాయి. ఆ సమయం నుంచే అవి ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల ఉండే ఖాళీ కుండలు, కంటైనర్లు, పాత బకెట్లు, ఇతర డబ్బాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి నీరు నిల్వ ఉండకుండా శుభ్రపరచండి. అలాంటి వాటి కారణంగానే దోమలు సంతతిని పెంచుకుంటాయి. ఇంట్లో నిత్యం వినియోగించే కూలర్లు, డస్ట్ బిన్‌లు క్రమం తప్పకుండా శుభ్రపరచండి. కీటకాలు, దోమలు ఇలాంటి వాటిల్లో పోగయ్యే అవకాశం ఉంది.

దోమలను దూరంగా ఉంచేందుకు ఇంట్లో తేలికపాటి కర్పూరాన్ని వెలిగించండి. దీంతో పాటు అందుబాటులో ఉన్న ఇతర ఉత్పత్తులు, మెషిన్లను వాడటం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా కాపాడుకోవచ్చని అధికారులు వివరిస్తున్నారు.

Advertisement

Next Story