దిశ, వెబ్‌డెస్క్ : కోడి కాలు ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. పందెం ఆడి పౌరుషాన్ని చూపిస్తుందనుకున్న కోడిపుంజు.. తన ప్రతాపాన్ని పెంచి, పోషించిన పందెం రాయుడిపై చూసి ఆయన చావుకు కారణమైంది. ఇంతకుూ అది ఎక్కడ దాడి చేసింది.. ఆయు ఎలా చనిపోయారో తెలుసా..?
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొండాపూర్ కు చెందిన తనుగుల సతీష్(45).. గొల్లపల్లి పరిధిలోని లొత్తునూర్ శివారులో ఆడుతున్న కోడి పందేలకు వెళ్లాడు. పందేలు ప్రారంభం కావడంతో తన కోడి పుంజు కాళ్లకు కత్తులు కట్టేందుకు సిద్ధమయ్యాడు. కోడిని రెండు కాళ్ల మధ్యలో పెట్టి దాని కాళ్లకు కత్తి కడుతున్నాడు. ఒక కాలికి కోడికత్తి కట్టి మరో కాలికి కడుతుండగా కోడి తప్పించుకునే క్రమంలో కత్తికట్టిన కాలు సతీష్ పురుషాంగం, వృషణాలకు తగిలింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. సతీష్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.