మానవతా దృక్పథంతో ఆదుకోండి.. కేంద్ర బృందానికి సీఎం జగన్ విజ్ఞప్తి 

by  |
Jagan
X

దిశ, ఏపీ బ్యూరో : ‘వరద విపత్తు హృదయవిదారకరం. నష్టం అంచనా కోసం మీరు ఆయా ప్రాంతాల్లో పర్యటించినందుకు ధన్యవాదాలు. ఉదారంగా, మానవతా పరంగా స్పందించాలని కోరుతున్నా. మేం పంపించిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదు. నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో మాకు సమర్థవంతమైన వ్యవస్థ ఉంది’ అని సీఎం జగన్ కేంద్ర బృందంతో అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర బృందంతో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎన్టీఆర్ఎఫ్ నిధులు నిండుకున్నాయి. పనులు చేయాలంటే నిధులు అవసరం. వెంటనే అడహాక్ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం పనితీరు భేష్

వరద బాధిత ప్రాంతాల్లో పరిశీలించిన అంశాలను కేంద్ర బృందం సోమవారం సీఎం వైఎస్ జగన్‌కు వివరించింది. కేంద్ర బృందం తరఫున ఎన్ఎండీఏ సలహాదారు కునాల్‌ సత్యార్థి వివరాలు అందించారు. ‘3 రోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాం. వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించాం. కడప జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. పశువులు చనిపోయాయి, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులతో పాటు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. అంకిత భావంతో పనిచేసే అధికారులు మీకు ఉన్నారు. విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారు. వీరంతా మాకు మంచి సహకారాన్ని అందించారు. మా పర్యటనల్లో వివిధ రాజకీయ ప్రతినిధులను, మీడియా ప్రతినిధులను కలుసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు’ అని కొనియాడారు.

మా వంతు సహకారం అందిస్తాం

‘రాయలసీమ ప్రాంతంలో సంప్రదాయంగా వచ్చే వరదలు కావు ఇవి. కరువు ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఊహించని రీతిలో వర్షాలు పడ్డాయి. ఇంత స్థాయిలో వరదను తీసుకెళ్లే సామర్థ్యం అక్కడ ఉన్న నదులు, వాగులు, వంకలకు లేదు. ఈ స్థాయి వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యాంలు కూడా ఈ ప్రాంతంలో లేవు. ఉన్న డ్యాంలు, రిజర్వాయర్లు కూడా ఈ స్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తున్నాయి. కరువు ప్రాంతాల్లో కుంభవృష్టి, నిరంతరం మంచి వర్షాలు కురిసే చోట కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ వరదల వల్ల కడప జిల్లాకు అపార నష్టం కలిగింది. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట తీవ్ర నష్టం వాటిల్లింది. మౌలిక సదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి.. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో వరదల ప్రభావం అధికంగా ఉంద’ని కేంద్ర బృందం తెలిపింది.

అంతేకాకుండా ‘పంట చేతికందుతున్న సమయంలో నీటి పాలైంది. శనగ పంట కూడా తీవ్రంగా దెబ్బతింది. వాటర్‌ స్కీములు కూడా దెబ్బతిన్నాయి. అన్నమయ్య నుంచి వెళ్లే తాగునీటి సరఫరా వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇరిగేషన్‌కూ తీవ్ర నష్టం ఏర్పడింది. బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు చాలా బాగా పని చేశారు. విద్యుత్ సహా అన్ని రకాల శాఖలు చాలా బాగా పనిచేశాయి. అత్యవసర సర్వీసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు చాలా బాగా పని చేశారు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఇంత త్వరగా కరెంటు పునరుద్ధరణ అనేది సహజంగా జరగదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం’ అని కేంద్ర బృందం కొనియాడింది.

సహాయ కార్యక్రమాల కోసం కలెక్టర్లకు వెంటనే నిధులు ఇవ్వడం వల్ల చాలా పనులు వేగంగా జరిగాయి. అలాగే జేసీబీలు పెట్టి.. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడం అభినందనీయం. వరదల వల్ల జరిగిన నష్టంలో 40 శాతం రోడ్లు, భవనాలటి రూపేణా జరిగింది. 32 శాతం నష్టం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగింది. ఇగిగేషన్‌ స్కీంల రూపేణా 16శాతం మేర నష్టం జరిగింది. వీలైనంత మేర ఆదుకోవడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని కేంద్ర బృందం హామీ ఇచ్చింది.

ధాన్యం కొనుగోలులో నిబంధనల సడలింపు ఇవ్వండి

ధాన్యం కొనుగోలులో నిబంధనల సడలింపు చేయాలని సీఎం వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నందున తేమ, ఇతరత్రా నిబంధనల విషయంలో సడలింపులు చేయాలని కోరారు. ‘ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉంది.. ప్రతి రైతు పంట కూడా ఇ–క్రాప్‌ అయ్యింది. సోషల్‌ ఆడిట్‌ కూడా చేయించాం. ఇ–క్రాప్‌కు సంబంధించి రశీదు కూడా రైతుకు ఇచ్చాం. నష్టపోయిన పంటలకు సంబంధించి ఖచ్చితమైన, నిర్ధారించబడిన లెక్కలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నష్టానికి సంబంధించిన వాస్తవ వివరాలను మీకు అందించాం. కొవిడ్‌ నియంత్రణ చర్యల కోసం వినియోగించినందు వల్ల ఎస్టీఆర్‌ఎఫ్‌ నిధులు నిండుకున్నాయని మా ఆర్థిక శాఖ కార్యదర్శి మీకు వివరించారు. పనులు చేయాలంటే నిధులు అవసరం, వెంటనే అడహాక్‌ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని’ సీఎం జగన్ కేంద్ర బృందాన్ని కోరారు.

అలాగే కేంద్ర బృందం చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని, దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తులను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని జగన్ తెలిపారు. వరద నీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా ఇటీవల ఒక కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పారు. వీలైనంత త్వరగా పెద్ద మొత్తంలో నీటిని తరలించే అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడున్న రిజర్వాయర్లు, డ్యాంలపై పరిశీలన చేసి తగిన చర్యలు చేపడతాం. ఆటోమేటిక్‌ వాగర్‌ గేజ్‌ సిస్టంపైనా దృష్టిపెడతాం అని సీఎం జగన్ కేంద్ర బృందంతో సమీక్షలో వెల్లడించారు.



Next Story