బీసీసీఐ టార్గెట్ @ రూ. 52 వేల కోట్లు.. పోటీ పడుతున్న దిగ్గజ స్పాన్సర్లు..!

by  |
బీసీసీఐ టార్గెట్ @ రూ. 52 వేల కోట్లు.. పోటీ పడుతున్న దిగ్గజ స్పాన్సర్లు..!
X

దిశ, స్పోర్ట్స్: బోర్డ్ ఆఫ్ క్రికెట్ ఫర్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు. ఏటా రూ. వేల కోట్లు తన ఖజానాలో వేసుకుంటుంది. ఐసీసీకి వచ్చే ఆదాయం కంటే బీసీసీఐ ఆదాయం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. టీమ్ ఇండియా స్వదేశంలో ఆడే ద్వైపాక్షిక సిరీస్‌ల ద్వారా వచ్చే ఆదాయం కంటే.. ఐపీఎల్ ద్వారా భారీగా ఆదాయాన్ని అర్జిస్తున్నది. ఈ ఏడాది ఐపీఎల్ కొత్త జట్లు, మీడియా హక్కుల టెండర్ల ద్వారా రూ. 52 వేల కోట్లు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నది. ఇప్పటికే రెండు కొత్త జట్లను వేలం వేయడం వల్ల బీసీసీఐ ఖజానాలోకి రూ. 12,725 కోట్లు వచ్చి చేరాయి. లక్నో ఫ్రాంచైజీని ఆర్పీఎస్‌జీ గ్రూప్ రూ. 7090 కోట్లకు, అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సీవీసీ క్యాపిటల్స్ రూ. 5625 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందులో లక్నో ఫ్రాంచైజీకి బీసీసీఐ పచ్చజెండా ఊపింది. అయితే సీవీసీ క్యాపిటల్ సంస్థపై కొన్ని ఆరోపణలు రావడంతో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని హోల్డ్‌లో పెట్టింది. బీసీసీఐ నియమించిన స్వతంత్ర సభ్యుల నిపుణుల కమిటీ కనుక ఆ బిడ్‌ను తిరిస్కరిస్తే రెండో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్‌కు బిడ్ దక్కుతుంది. అప్పుడు కొంత గండి పడే అవకాశం ఉన్నది. కానీ మొత్తానికి రెండు జట్ల ద్వారా అయితే రూ. 12వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరడం మాత్రం ఖాయం.

మీడియా హక్కులకు భారీ డిమాండ్..

ఐపీఎల్ మీడియా హక్కుల కోసం ఈ నెలాఖరు లోపు బీసీసీఐ టెండర్లు పిలవనున్నది. ఈ-ఆక్షన్ పద్ధతి ద్వారా గ్లోబల్ టెండర్లు పిలవడానికి బీసీసీఐ సిద్ధపడుతున్నది. ఈ టెండర్ల ద్వారా బీసీసీఐ ఖజానాలో రూ. 40 వేల కోట్లకు పైగా చేరబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ సారి మీడియా హక్కుల ద్వారా కచ్చితంగా రూ. 40 వేల కోట్ల కంటే ఎక్కువగానే ఆదాయం వస్తుందని స్వయంగా సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. బ్యాక్ స్టేజ్ విత్ బోరియా అనే షోలో పాల్గొన్న గంగూలీ మీడియా హక్కుల గురించి వివరించాడు. రెండు ఫ్రాంచైజీల ఏర్పాటు ద్వారా రూ. 12 వేల కోట్లకు పైగా వచ్చాయి. మేం ఊహించిన దాని మూడు రెట్లు ఖజానాలో చేరాయి. అలాగే మీడియా హక్కుల ద్వారా రూ. 40 వేల కంటే ఎక్కువ ఖజానాలో తప్పకుండా చేరుతాయని గంగూలీ అన్నాడు. ఐపీఎల్ మీడియా హక్కులు ప్రస్తుతం స్టార్ఇండియా వద్ద ఉన్నాయి. 2018లో రూ. 16,347 కోట్లకు ఈ హక్కులు దక్కించుకున్నది. టీవీ, డిజిటల్, రేడియో, స్ట్రీమింగ్ హక్కులు అన్నీ ఒకే ప్యాకేజీగా స్టార్ ఎగరేసుకొని పోయింది. ఆనాడు కేవలం స్టార్ ఇండియా, సోనీ నెట్‌వర్క్ మాత్రమే పోటీ పడ్డాయి. కానీ ఈ సారి నాలుగు నుంచి ఐదు మీడియా సంస్థలు హక్కుల కోసం పోటీ పడతాయని భావిస్తున్నారు.

లైన్‌లో ఉన్నసంస్థలు ఇవే..

ఈ సారి మీడియా హక్కులను టీవీ, డిజిటల్, రేడియో, మొబైల్ విడివిడిగా అమ్మనున్నారు. అయితే కాంపోజిట్ విధానంలో అన్ని హక్కులు కూడా దక్కించుకోవచ్చు. గతంలో స్టార్ ఇండియా కాంపోజిట్ విధానంలో గంపగుత్తగా అన్ని హక్కులుకొల్లగొట్టింది. ఈ సారి రూ. 25 వేల కోట్లు మీడియా హక్కుల ద్వారా వస్తాయని తొలుత భావించారు. అయితే రెండు కొత్త జట్లు భారీ ధరకు అమ్ముడు పోవడంతో బీసీసీఐ అంచనాలు పెరిగాయి. మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరుగుతుండటంతో రూ.40 వేల కోట్ల కంటే ఎక్కువ గానే సమకూరుతాయని బీసీసీఐ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ఈ ఏడాది కొత్త జట్లు, మీడియా హక్కుల అమ్మకం ద్వారా రూ. 52 వేల కోట్లు ఖజానాలో వేసుకోబోతున్నది. స్టార్ ఇండియా, జీటీవీతో కలసి సోనీ నెట్‌వర్క్, అమెజాన్‌తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్ 18 కూడా బరిలో ఉండనున్నట్లు తెలుస్తున్నది. ఈ సారి బడా కంపెనీలు ఉండటంతో బీసీసీఐ పంట పండుతుందని భావిస్తున్నారు.



Next Story