ప్రసంగిస్తూ కిందపడిపోయిన ఆర్.కృష్ణయ్య.. ఇంతకీ ఏమైంది..?

by  |
ప్రసంగిస్తూ కిందపడిపోయిన ఆర్.కృష్ణయ్య.. ఇంతకీ ఏమైంది..?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ధర్నాలో పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.క‌‌ృష్ణయ్య స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయన అనుచరులు, అభిమానులు ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించడంతో ఆయన కోలుకుంటున్నారు. మంగళవారం బషీర్‌బాగ్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో పని చేస్తున్న మోడల్ స్కూల్ టీచర్లకు గత కొన్ని నెలలుగా వేతనాలు రావడం లేదు. దీంతో వారు ఆర్ కృష్ణయ్యను కలిసి వేతనాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనికి స్పందించిన ఆయన బషీర్‌బాగ్‌లోని విద్యా శాఖ మంత్రి కార్యాలయం ముందు మోడల్ స్కూల్ టీచర్లతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూనే కింద పడిపోయారు. ఒక్క సారిగా ఆందోళనకు గురైన ఆయన అనుచరులు వెంటనే విద్యానగర్‌లోని ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో వేగంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ నెల 11వ తేదీన విజయవాడకు వెళ్లిన ఆర్ కృష్ణయ్య మరుసటి రోజు రాత్రికి నగరానికి చేరుకున్నారు. సోమవారం ఉదయం జ్వరం, విరేచనాలతో బాధపడుతూనే ఆయన తన పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్నారు. పూర్తిగా నయం కాకముందే విద్యా శాఖ మంత్రి కార్యాలయం ముందు ధర్నాలో పాల్గొనగా షుగర్ లెవల్స్ పెరిగి కింద పడిపోయారు.


Next Story

Most Viewed