బీబీ 5 రివ్యూ – 5 రెట్లు ఎంటర్‌టైన్‌మెంట్

by  |
Bigg Boss
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇక బోర్‌డమ్‌కు బై బై… అంటూ గత నెల రోజుల నుండి ప్రోమోలతో ఊదరగొట్టిన బిగ్ బాస్ 5 ఓపెనింగ్ ఎపిసోడ్ ఆదివారం రోజు సాయంత్రం 6 గం.లకు ప్రసారమైంది. క్లాస్, మాస్ స్టెప్పులతో నాగార్జున తనదైన శైలిలో కార్యక్రమాన్ని ప్రారంభించి, బిగ్ బాస్ హౌస్ టూర్ చేశారు. ఇల్లు మొత్తం కొత్త హంగులతో తీర్చిదిద్దారు. కొత్తగా పవర్ రూమ్ అని కూడా ఏదో పెట్టారు. దాని సంగతి ఏంటో మున్ముందు తెలుస్తుంది. ఇక సోఫా డిజైన్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఇక హౌస్ టూర్ పూర్తయ్యాక ఒక్కొక్క కంటెస్టంట్‌ను నాగార్జున ఆహ్వానించారు.

మొదటి కంటెస్టంట్‌గా సిరిహనుమంత్‌ను నాగార్జున ఆహ్వానించారు. భూమ్ బద్దలు పాటతో స్టేజీని బద్దలు కొట్టి, కుడి కాలు పెట్టి బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టిన సిరి, వెబ్‌సిరీస్‌లు, సీరియళ్ల ద్వారా ప్రేక్షకులకు పరిచయం. ఆమె తర్వాత రెండో కంటెస్టంట్‌గా వీజే సన్ని ఎంట్రీ ఇచ్చారు. ఆపై లహరి షారీ, సింగర్ శ్రీరామచంద్ర, కొరియోగ్రాఫర్ యానీ, యాంకర్ లోబో, నటి ప్రియ, మోడల్ జశ్వంత్ జెస్సీ, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక, యూట్యూబర్ షణ్ముఖ్, నటి హమిదా, డ్యాన్స్ మాస్టర్ నటరాజ్, యూట్యూబ్ సెన్సేషన్ సరయు, నటుడు విశ్వ, నటి ఉమాదేవి, మానస్, ఆర్జే కాజల్, శ్వేతా వర్మ, ఇక చివరి కంటెస్టంట్‌గా యాంకర్ రవి ఎంట్రీ ఇచ్చారు.

ఇంట్లో అడుగుపెట్టిన 19 మంది కంటెస్టంట్‌లలో నలుగురు ఐదుగురు మినహా మిగతా వాళ్లందరూ అంతో ఇంతో ప్రేక్షకులకు పరిచయం ఉన్నవాళ్లే. అయితే రెగ్యులర్ టీవీ ప్రేక్షకులకు చాలా మంది తెలియకున్నా, ఇప్పటి ఇంటర్నెట్, యూట్యూబ్ తరానికి చాలా మంది తెలుసు. అయితే వీళ్లు సెలెబ్రిటీలా అని నోరువిప్పిన వాళ్లందరికీ ఆయా కంటెస్టంట్‌ల ఏవీలు కొత్త దృక్పథాన్ని అర్థమయ్యేలా చేశాయి. ముఖ్యంగా ప్రియాంక, నటరాజ్, సరయు, కాజల్‌ల వీడియోలు వారి వ్యక్తిగత జీవితాల్లో కొత్త కోణాన్ని తెలియజేశాయి. ప్రియాంక లింగమార్పిడి, నటరాజ్ తండ్రి కాబోవడం, సరయు బోల్డ్‌నెస్, కాజల్ హిందూ ముస్లిం జంట… ఇలా సామాజిక, భావోద్వేగ అంశాలను కూడా ఏవీల ద్వారా పరిచయం చేశారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అంటుంటారు, కానీ బిగ్‌బాస్ విషయంలో మజ్జిగ పలచగా అయినా కూడా ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం కావాల్సినంత ఉంటుందని ఈ సీజన్ ద్వారా నిర్వహకులు నిరూపించబోతున్నట్లు అనిపిస్తోంది.

స్వతహాగా హైపర్ యాక్టివ్ అయిన రవి, కాజల్, విశ్వ, సరయు, లోబో, వీజే సన్నిలు ఈసారి డామినేట్ చేసేలా కనిపిస్తున్నారు. సరయు అయితే ఏకంగా నాగార్జునతోనే తన ఇంటర్నెట్ లాంగ్వేజ్ మాట్లాడటం, హౌస్‌లో ఎంట్రీ ఇవ్వగానే శ్వేతా వర్మ రెడీ టు మింగిల్ బిహేవియర్, ఇచ్చిన టాస్క్‌ను ఉమాదేవి చాలా సీరియస్‌గా ఆడటం.. ఇలాంటివన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరూ చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసి, పక్కా ప్లాన్‌తో వచ్చినట్లు అనిపిస్తోంది. అయితే బయట వారి పీఆర్ స్ట్రాటజీ ఎలా ఉన్నా, హౌస్‌లో వాళ్లు ఎంతకాలం ఉంటారనేది పూర్తిగా వాళ్ల ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుందనేది అక్షర సత్యం. చూద్దాం ఇప్పుడే కదా.. ఆట మొదలైంది. నాగార్జున చెప్పినట్లు 5 రెట్లు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి. మళ్లీ ఎపిసోడ్ అవగానే దిశలో రివ్యూ చదవాల్సిందే!

– ప్రగత్ దోమల


Next Story

Most Viewed