బ్యాంకులే ఆదుకోవాలి.. ఎస్ఎల్‌బీసీ సమావేశంలో సీఎం జగన్

by  |
cm jagan
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గగా భారం విపరీతంగా పెరిగిందన్నారు. కోవిడ్ వల్ల రూ.30 వేల కోట్ల భారం పడినట్లు చెప్పుకొచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మంగళవారం 217వ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యూనియన్ బ్యాంక్ సిఈవోతోపాటు భారత రిజర్వు బ్యాంకు అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక అవసరాలు..రాష్ట్రానికి ఏం చేస్తే మేలు జరుగుతుంది అనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కోలుకోలేని దెబ్బతీసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోవడం, మరోవైపు ప్రజల కనీస అవసరాలు తీర్చడం కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడం వల్ల, ప్రభుత్వంపై భారం మరింత పెరిగింది. మహమ్మారి వల్ల ప్రభుత్వ ఆదాయం 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో రూ.14 వేల కోట్లు తగ్గింది. మరోవైపు కోవిడ్‌ నివారణ, నియంత్రణ కోసం అదనంగా రూ.8 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.30 వేల కోట్ల భారం పడింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగం ఎంతో సహకరించింది. అందువల్లే గట్టెక్కాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. బ్యాంకుల సహకారంతోనే గ్రామీణ ఆర్థిక పరిస్థితి కూడా గాడిలో పడిందని స్పష్టం చేశారు. బ్యాంకులు తమ మొత్తం నికర రుణంలో ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన దానికి మించి 59.5 శాతం రుణాలు ఇవ్వడం, మరోవైపు రుణాలు–డిపాజిట్ల నిష్పత్తి 136 శాతం ఉండేలా బ్యాంకులు చూపిన చొరవ అభినందనీయమని కొనియాడారు.

3శాతం వడ్డీతో రూ.35వేలు రుణాలివ్వండి

బ్యాంకులు నిర్దేశించుకున్న నికర రుణ మెుత్తంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గాయి. మిగిలిన వారికి కూడా రుణాలు మంజూరు చేయండి. అలాగే అర్హులైన ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందేలా చూడండి. కౌలు రైతులకు కూడా రుణాలు అందేలా చూడండి. రాష్ట్రంలో 4,240 ఆర్బీకేలలో బ్యాంకింగ్ సేవలు ప్రారంభం కావాల్సి ఉంది. ఆ మేరకు కరెస్పాండెంట్లను నియమించండి.

ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. అయితే ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. మరో రూ.35వేల చొప్పున లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు అందించాల్సి ఉంది. ఇళ్ల స్థలాలను ప్రభుత్వం పక్కాగా మహిళల పేరుతో రిజిస్టర్ చేశాం కాబట్టి వాటిని తనఖా పెట్టుకుని అయినా బ్యాంకులు రుణాలు పంపిణీ చేయండి. బ్యాంకులు ఇచ్చే ఆ రూ.35వేల రుణాలపై లబ్ధిదారుల నుంచి కేవలం 3శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయండి. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఇందుకు ప్రభుత్వం చొరవ చూపి పేదలకు మేలు చేయండి అని సీఎం జగన్ ఎస్ఎల్‌బీసీ సమావేశంలో విజ్ఞప్తి చేశారు.


Next Story