రికార్డు లాభాలు సాధించిన యాక్సిస్ బ్యాంక్!

by  |
Axis Bank
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను వెల్లడించింది. రెండో త్రైమాసికంలో గతేడాది నమోదైన రూ. 1,683 కోట్లతో పోలిస్తే ఏకంగా 86 శాతం ఎక్కువగా రూ. 3,133 కోట్లను బ్యాంకు నివేదించింది. బలమైన కాసా(కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్), ఛార్జీల వసూలు, అన్ని విభాగాల్లోని రుణాల వృద్ధి, స్థిరమైన బ్యాలెన్స్ షీట్, ఆస్తుల నాణ్యత కారణంగానే లాభాలు మెరుగ్గా నమోదయ్యాయని యాక్సిస్ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు నిర్వహణ లాభం రూ. 5,928 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 7,901 కోట్లకు చేరుకుంది. ‘యాక్సిస్ బ్యాంక్ వ్యాపర విభాగంలో పటిష్ఠమైన పురోగతిని సాధిస్తోంది.

ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎస్ఎంఈ), మిడ్-కార్పొరేట్ విభాగాలపై దృష్టి సారిస్తున్నాము. రిటైల్ విభాగంలో మెరుగైన చెల్లింపులు, సురక్షితమైన సేవల వృద్ధిని సాధించగలుగుతున్నామని’ యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ అమితాబ్ చౌదరీ అన్నారు. ప్రస్తుత పండుగ సీజన్ కోసం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్, స్థానిక రిటైలర్ల ద్వారా ప్రత్యేకంగా డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నామని ఆయన వివరించారు. ఈ త్రైమాసికంలో బ్యాంకు రిటైల్ రుణాలు 16 శాతం, పెరిగాయి. ఎస్ఎంఈ రుణాలు 18 శాతం వృద్ధి నమోదయ్యాయని బ్యాంకు వెల్లడించింది. కాగా, మంగళవారం త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో బ్యాంకు షేర్ ధర స్వల్ప తగ్గి రూ. 845.10 వద్ద ట్రేడయింది.



Next Story