డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరిట దోపిడీ

by  |
డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరిట దోపిడీ
X

’ఇందిరమ్మ ఇండ్లు పిట్టగూడులా కట్టారు.. చాలీచాలని డబ్బులు ఇచ్చారు.. కోడలు.. కొడుకు ఎక్కడుండాలి.. ఇంటికి బిడ్డ, అల్లుడొస్తే ఎక్కడుండాలి.. గొడ్డు, గేదె ఉంటుంది.. ఇంటి ముందర మేకలుంటాయి.. అందుకే రెండు గదులు, కిచెన్, హాల్ తో పాటు ఇంటి ముందర స్థలం ఉండేలా.. డబుల్ బెడ్రూం ఇల్లును సర్కారే నిర్మించి ఇస్తుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సొంతింటి కల నెరవేరుస్తాం.. పేద లబ్ధిదారుల చేతిలో తాళం చెవి పెడతాం. నేరుగా వెళ్లి గృహ ప్రవేశం చేసుకోవడమే..

– సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకంపై ప్రతీ సభ, సమావేశంలో చెప్పిన మాటలు

‘మన గ్రామంలో ప్రభుత్వ స్థలం లేదు. ప్రైవేటు భూమి కొనేందుకు డబ్బులు కావాలి. ఒక్కో ఇంటి లబ్ధిదారులు రూ.60వేల నుంచి రూ.లక్ష వరకు ఇవ్వాలి. అలాగైతేనే ఇల్లు వస్తుంది. స్థలం కొనగానే.. ఇంటి నిర్మాణానికి డబ్బులు సరిపోవడం లేదు. మీకు ఇల్లు కావాలంటే మరో రూ.60వేల నుంచి రూ.లక్ష ఇవ్వాల్సిందే.. అంటూ.. మళ్లీ రెండో విడత వసూలు చేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి లేబర్ దొరకనందున.. మీరంతా విడతల వారీగా వచ్చి కూలీ పని చేయాలి. అప్పుడే ఇల్లు వస్తుందని ఆశ పెడుతున్నారు.

– ఇదీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఎదురవుతున్న పరిస్థితి

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో నిబంధనలకు పాతరేస్తున్నారు.. ‘డబుల్’ ఇండ్ల పేరిట డబుల్ సార్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి లేనందున ప్రైవేటు భూమి పేరిట ఒకసారి.. నిర్మాణానికి నిధులు సరిపోవడం లేదని మరోసారి.. రెండు విడతలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పేదలకు సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో అడినప్పుడల్లా.. అడిగిన కాడికి అప్పులు చేసి మరీ ఇస్తున్నారు. ఇండ్ల నిర్మాణం తర్వాత లబ్ధిదారులకు ఎంపిక చేయాల్సి ఉండగా.. ఇండ్లు మంజూరవగానే.. నిర్మాణాలకు ముందే లబ్ధిదారుల ఎంపిక చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు స్థానిక రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉండగా.. కాంట్రాక్టర్లు కూడా భాగస్వాములవుతున్నారని తెలుస్తోంది.

అడ్డగోలు వసూళ్లు

పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడకల గదుల పథకం అధికార పార్టీ నాయకులు, కింది స్థాయిలోని ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురుస్తోంది. పేదల అవసరాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నిర్మల్ జిల్లాకు మొత్తం 6,686 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 3,426 ఇండ్లు రూరల్​కు, 3,260 ఇండ్లు అర్బన్​కు మంజూరయ్యాయి. వీటిలో 96 స్థలాలను గుర్తించి.. 5,641ఇండ్లకు పరిపాలనా అనుమతులిచ్చారు. ఇందులో 3,184 ఇండ్లకు టెండర్లు ఫైనల్ చేశారు. నిర్మల్ నియోజక వర్గంలో 3,761, ముధోల్ నియోజకవర్గంలో 2,240, ఖానాపూర్ నియోజకవర్గంలో 685 చొప్పున డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.05 లక్షల నుంచి రూ.5.25 లక్షల మేర ఇస్తున్నాయి. గత నాలుగేళ్లుగా చాలా గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండగా.. వీటిని సాకుగా చూపి కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు.

ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్న లబ్ధిదారులు

కుభీర్ మండలం మాలేగాంలో డబుల్ ఇండ్ల పథకంలో ముందుగా భూమి కోసం రూ.60వేల చొప్పున, తర్వాత నిర్మాణానికి నిధులు సరిపోవడం లేదని రూ.60వేల చొప్పున వసూలు చేశారు. ఇండ్ల నిర్మాణ పనులకు కూడా లబ్ధిదారులను ఉచితంగా కూలీలుగా పనులు చేయించుకోవడం వివాదానికి దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి రైతు వేదిక ప్రారంభోత్సవానికిరాగా.. మహిళలు, స్థానికులు అక్రమ వసూళ్లను ఆపాలని, తమకు న్యాయం చేయాలంటూ ఆయన కాన్వాయ్ అడ్డుకున్నారు. ఇది ఒక్క మాలేగాం గ్రామానికే పరిమితం కాలేదు. ముధోల్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. తానూర్ మండలం బామ్ని గ్రామంలో ప్రభుత్వ భూమి లేదని, స్థలం కొనుగోలుకు ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.లక్ష చొప్పున కొందరు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇక నిర్మాణాలకు నిధులు సరిపోవడం లేదని మరో రూ.80వేల చొప్పున ఒక్కో లబ్ధిదారుడి నుంచి వసూలు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఇక్కడ ఇండ్ల నిర్మాణానికి ముందే లబ్ధిదారుల నుంచి వసూళ్లు చేయటం కొసమెరుపు.

వసూళ్లతో నిలిచిన పనులు

కుభీర్ మండలం సాంవ్లీలోనూ గతంలో పెద్ద ఎత్తున వసూళ్లు చేయగా.. ఇండ్ల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. మాలేగాం, సాంవ్లీతో పాటు మరికొన్ని గ్రామాల్లో గత నాలుగేళ్లుగా నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇండ్ల మంజూరు దశలోనే వసూళ్లకు దిగుతున్నారు. టెండర్లు కాకుండానే.. నిర్మాణం చేయకుండానే వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ స్థలం లేదని తెలిసినా.. కొన్ని చోట్ల ఇండ్లు మంజూరు చేశారు. స్థలం కొనుగోలుకు, తర్వాత నిర్మాణాలకు నిధులు సరిపోవడం లేదని వసూలు చేయటం వివాదానికి దారి తీస్తోంది. సొంతిల్లు కల నెరవేర్చుకునేందుకు లబ్ధిదారులు అప్పులు చేసి ఇస్తుండడం గమనార్హం. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులే కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తగా.. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లతో కలిసి రెండు విడతలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు.


Next Story

Most Viewed