యాషెస్ 2021-22 సిరీస్‌: గబ్బాలో అదరగొట్టిన ఆసీస్‌

by  |
యాషెస్ 2021-22 సిరీస్‌: గబ్బాలో అదరగొట్టిన ఆసీస్‌
X

దిశ, స్పోర్ట్స్: యాషెస్ 2021-22 సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగవ రోజు ఇంగ్లాండ్ నిర్దేశించిన 20 పరుగుల స్వల్ఫ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోర్ 220/2తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. డేవిడ్ మలన్ (82) కేవలం 2 పరుగులు జోడించి నాథన్ లయన్ బౌలింగ్‌లో మార్నస్ లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేర్చాడు.

ఆ తర్వాత కొద్ది సేపటికే కెప్టెన్ జో రూట్ (89) కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఓలీ పోప్ (4) నాథన్ లయన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. బెన్ స్టోక్స్ (14), జాస్ బట్లర్ (23) కాసేపు క్రీజులో నిలబడి పోరాడారు. అయితే బెన్ స్టోక్స్.. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జాస్ బట్లర్.. జోష్ హాజెల్ వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా పెద్దగా పోరాడకుండానే వికెట్లు పోగొట్టుకున్నారు. క్రిస్ వోక్స్ (16), ఓలీ రాబిన్‌సన్ (8), మార్క్ వుడ్ (6) నిరాశ పరచడంతో ఇంగ్లాండ్ జట్టు 297 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా ముందు కేవలం 20 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాథన్ లయన్ చెలరేగి 4 వికెట్లు తీయగా.. గ్రీన్, కమిన్స్ చెరో రెండు వికెట్లు, మిచెల్ స్టార్క్, హాజెల్‌వుడ్ చెరో వికెట్ తీశారు.

ఇక స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ అలెక్స్ కేరీ (9) వికెట్ కోల్పోయింది. మార్కస్ హారిస్ (9) మరో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో తొలి టెస్టును గెలిచింది. గబ్బా టెస్టు కేవలం 4 రోజుల్లోనే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్(152) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాథన్ లయన్ 400 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో ఈ ఘనతను అందుకున్న 17వ బౌలర్‌గా లయన్ రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో యాషెస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యత సాధించింది. అంతే కాకుండా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచింది.

సంక్షిప్త స్కోర్ బోర్డు:

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 147 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 425 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 297 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 20/1


Next Story

Most Viewed