మహిళా సర్పంచ్ ఫిర్యాదు.. మండల అధికారి సస్పెండ్

by  |
Mahila-sarpanch1
X

దిశ, అశ్వారావుపేట టౌన్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అందించిన మొక్కల నెలవారి నిర్వహణ ఖర్చులు జమ చేయడంలో విఫలమయ్యాడనే అభియోగం ఈజీఎస్ ఏపీఓ సస్పెన్షన్ కు కారణమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల ఈజీఎస్ ఏపీఓ (అదనపు కార్యక్రమ అధికారి) ఎ. శ్రీనును విధుల నుండి తాత్కాలికంగా తొలగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. 2020-2021 సంవత్సరానికి గాను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలోని రాచన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సుమారు 25 ఎకరాలకు పామాయిల్, ఒక ఎకరానికి కొబ్బరి మొక్కలను రైతులకు అందజేశారు. పథకంలోని వాచ్ అండ్ వార్డ్ గా ఒక్కో మొక్కకు నెలకు 15 రూపాయల చొప్పున మూడు సంవత్సరాలు పాటు ఇవ్వవలసిన నిర్వహణ ఖర్చులను జమ చేయడం లేదంటూ, ఈజీఎస్ సిబ్బందిని కలసి స్థానిక రైతులు పలుమార్లు విన్నవించుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప అక్టోబర్ 18న కొత్తగూడెం కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.

ఈ విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో డీఆర్డీఏ అదనపు జిల్లా గ్రామణాభివృద్ధి అధికారి సుబ్రహ్మణ్యం సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు. సర్పంచ్ మడకం స్వరూప ఫిర్యాదులో పేర్కొన్న వివిధ అభియోగాల దృష్ట్యా ఈజీఎస్ ఏపీఓ ఎ.శ్రీను సస్పెన్షన్ కు గురైనట్లు జిల్లా కలెక్టర్, జిల్లా గ్రామణాభివృద్ధి అధికారి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక ఇదే ఉదంతంలో రామన్నగూడెం ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ కె.బాలకృష్ణ, విలేజ్ సెక్రటరీ ఎన్.రోహిత్ లు కూడా విధుల నిర్వహణలో విఫలమైనందున క్రమశిక్షణ నియమావళి నిబంధనల మేరకు ఒక్కొక్కరికి రూ.5000 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈజీఎస్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు కూలీలు విముఖత చూపుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.


Next Story

Most Viewed