- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్క్‌లో ఉద్యోగాలు.. 30 వేలమందికిపైగా యువతకు ఉపాధి
<p>దిశ, చౌటుప్పల్: నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కొత్త పుంతలు తొక్కించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య(టిఫ్)సంయుక్తంగా గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మల్కాపురం గ్రామంలో ఏర్పాటుచేసిన ఈ పార్కులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పనున్నారు. ఈ పార్కును దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడానికి టిఫ్ ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అందులో […]</p>

దిశ, చౌటుప్పల్: నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కొత్త పుంతలు తొక్కించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య(టిఫ్)సంయుక్తంగా గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మల్కాపురం గ్రామంలో ఏర్పాటుచేసిన ఈ పార్కులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పనున్నారు. ఈ పార్కును దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడానికి టిఫ్ ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఇక్కడ 10 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించేలా చర్యలు తీసుకోగా మరో 100 కంపెనీలు నిర్మాణంలో ఉన్నాయి. ఉత్పత్తులు ప్రారంభించిన వాటిలో ఎలక్ట్రికల్ ఆటో తయారీ, ప్యాకింగ్ యూనిట్స్, బ్రిక్స్ ఇండస్ట్రీస్, టైల్స్ తయారీ, బోర్ వెల్ బిట్స్ తయారీ, కంపెనీ నిర్మాణానికి ఉపయోగించే ఐరన్ షెడ్(మౌల్స్) పరిశ్రమలు ఉన్నాయి.

భారీగా పెట్టుబడులు..
ఇప్పటికే 1280 ఎకరాల స్థల సేకరణ పూర్తి చేయగా మరో 687 ఎకరాల స్థలానికి భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. టిఫ్ ఆధ్వర్యంలో 214 కోట్లతో 461 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే అభివృద్ధి చేసి పలు పరిశ్రమలకు కేటాయించారు. వీటిలో విద్యుత్ దీపాలు, విశాలమైన రోడ్లు నిర్మించి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. 441 పరిశ్రమలు సుమారు రెండు వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని టిఫ్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా మరో 230 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయగా, 80 ఎకరాలలో ఇంటర్నేషనల్ ఫర్నిచర్ పార్క్ నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం స్థలాన్ని గుర్తించింది.

30 వేలమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి
ఇప్పటికే 461 ఎకరాల స్థలంలో 442 కంపెనీలకు కేటాయింపులు జరిగాయి. వీటిలో 65 శాతం అనగా సుమారు 285 కంపెనీలు సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలే కావడం విశేషం. దేశంలో ఎక్కడా లేని విధంగా 450 మీటర్ల నుండి 2000 మీటర్ల స్థలాలలో పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశం కల్పించారు. దీంట్లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు భారీగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉండడంతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పార్కు ఏర్పాటుతో సుమారు 30 వేల మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.

పార్కు ప్రత్యేకతలు
* నిరుద్యోగులలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి 5 ఎకరాల స్థలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు.
* సుమారు 20 వేల మంది నివాసం ఉండేలా 194 ఎకరాలు సమీకృత పారిశ్రామిక గృహ సముదాయం (ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ) ఏర్పాటు.
* సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా స్కూలు, ఆస్పత్రులు, థియేటర్ల ఏర్పాటు.
* 2 లక్షల 50 వేల చదరపు అడుగుల లో రూ.41 కోట్ల వ్యయంతో కామన్ ఫెసిలిటీ సెంటర్(సీఎఫ్సీ) ఏర్పాటు.
* పరిశ్రమలలో యంత్రాలకు ఉపయోగపడే సరుకు దొరికేలా ఇండస్ట్రియల్ సూపర్ మార్కెట్,బ్యాంకులు ఏటీఎంలు, రెస్టారెంట్ల ఏర్పాటు.
* ఇంటర్నెట్ సదుపాయం
* ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐఏఎల్ఏ) అడ్వైజరీ కమిటీ ద్వారా పరిశ్రమ భవన నిర్మాణానికి కావాల్సిన అనుమతుల మంజూరు.

ఆహ్లాదకరమైన వాతావరణం..
పెట్టుబడులు,ఉపాధి కల్పనతో పాటు కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటు కోసం మొక్కల పెంపకానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. పూర్తి విస్తీర్ణంలో 33 శాతం మొక్కలు పెంచడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే సుమారుగా 40 వేల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. ఈ మొక్కల సంరక్షణకు ఒక ప్రత్యేక వ్యవసాయ నిపుణున్ని నియమించి, ప్రతి మొక్కకు డ్రిప్ సౌకర్యంతో నీటిని అందిస్తున్నారు. అంతేకాకుండా మురుగు నీటి శుద్ధీకరణకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి వాటిని మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా వర్షపు నీటి నిల్వల కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడంతోపాటు పక్కనే ఉన్న మల్కాపురం చెరువులోకి ఆ నీరు చేరేలా ఆరు కోట్ల రూపాయలతో కెనాల్ నిర్మాణం చేపట్టనున్నారు.

దేశంలో ఆదర్శంగా ఉండేలా చర్యలు
కొండవీటి సుధీర్ రెడ్డి, తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు.
దేశంలోనే ఆదర్శంగా ఉండేలా ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ను తీర్చి దిద్దుతున్నాము.ముఖ్యమంత్రి కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో వేగంగా పార్క్ పనులు జరుగుతున్నాయి. మరో సంవత్సరంలో పూర్తిగా పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభిస్తాయి.

సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం
గోపాల్ రావు,తెలంగాణ పారిశ్రామికవేత్తలు సమైక్య జాయింట్ సెక్రెటరీ.
ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనువైనది. సుమారు 50 లక్షల రూపాయలతో సూక్ష్మ తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే సదుపాయాన్ని కల్పించాము. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడంవలన ప్రభుత్వ సబ్సిడీలతోపాటు, బ్యాంకుల నుండి రుణ సదుపాయాన్ని పొందవచ్చు.

నెలకు 20 వేల రూపాయలు సంపాదిస్తున్నాను
వెంకటేష్, పాకింగ్ యూనిట్ మిషన్ ఆపరేటర్.
ఇక్కడ నెలకొల్పబడిన ప్యాకింగ్ యూనిట్ పరిశ్రమలలో మిషన్ ఆపరేటర్ గా పని చేస్తున్నాను. నాకు నెలకు ప్రస్తుతం 20000 వేల రూపాయల జీతంతో పాటు కుటుంబంతో ఉండడానికి నివాసాన్ని కల్పించారు. రాబోయే రోజుల్లో ఉత్పత్తి పెరిగే అవకాశం ఉన్నందున ఉద్యోగుల సంఖ్య పెరగడంతో పాటు తమకు జీతాలు కూడా పెంచే అవకాశం ఉన్నది.






