అభినందన్ విషయంలో పాక్ ఆర్మీ వణికింది -పాక్ ఎంపీ

by  |
అభినందన్ విషయంలో పాక్ ఆర్మీ వణికింది -పాక్ ఎంపీ
X

దిశ, వెబ్ డెస్క్ : బాలకోట్ ఎయిర్‌స్ట్రైక్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన వైమానిక పోరులో పాక్ విమానాలను బార్డర్ దాకా తరిమిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శత్రు సైన్యానికి చిక్కిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పాకిస్థాన్ ప్రభుత్వం భయపడిందట. ఆ దేశ ఆర్మీ జనరల్ జావేద్ బజ్వా కాళ్లు భయంతో గజగజ వణికాయట. ఈ విషయాన్ని పాకిస్థాన్ ముస్లీం లీగ్-ఎన్(పీఎంఎల్-ఎన్) నాయకుడు, ఎంపీ అయాజ్ సాదిఖ్ పార్లమెంట్‌లో వెల్లడించారు. అభినందన్‌ను భారత్‌కు అప్పగించే కంటే ముందు జరిగిన పరిణామాలను సాదిఖ్ పార్లమెంట్‌లో ప్రస్థావించారు.

‘నాకు గుర్తుంది. ఆ రోజు విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి హాజరయ్యేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరాకరించారు. అదే సమయంలో ఆర్మీ జనరల్ బజ్వా గదిలోకి వచ్చారు. అప్పుడు అతని కాళ్లు గజగజ వణుకుతున్నాయి. భయంతో చెమట పట్టింది. ఈ క్రమంలో ఖురేషీ అతనితో మాట్లాడుతూ, అభినందన్‌ను వెళ్లనీయండని చెప్పారు. లేదంటే ఈ రాత్రి 9గంటలకు భారత్ దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ఆ సమావేశానికి హాజరైన ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వంతో ఏకీభవించి అభినందన్‌ విడుదలకు అంగీకరించాయి’ అని చెప్పుకొచ్చారు.

ఇలా ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రతిపక్షాలు ఇప్పటివరకు అన్ని రకాలుగా మద్దతుగా నిలిచాయని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు రావట్లేదని వెల్లడించారు. అందుకే, ఇకనుంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. పాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే సాదిక్, అభినందన్ విషయాన్ని గుర్తు చేశారు. కాగా, పుల్వామా దాడి అనంతరం పాక్, భారత్‌ల మధ్య 2019 ఫిబ్రవరి 27న జరిగిన వైమానిక దాడి సమయంలో అభినందన్ నడిపిన మిగ్-21 కూలడంతో, ప్యారాష్యూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగిన విషయం తెలిసిందే. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పాక్ ఆర్మీ జెనీవా ఒప్పందం ప్రకారం, మార్చ్ 1న భారత్‌కు అప్పగించింది.

రాహుల్ ఇకనైనా కళ్లు తెరవాలి: జేపీ నడ్డా

అయాజ్ సాదిఖ్‌ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై విమర్శలు కురిపించారు. ‘కాంగ్రెస్ యువరాజు మన దేశానికి సంబంధించివేవీ నమ్మరు. చివరకు భారత ఆర్మీని కూడా. అందుకే అతను ఎంతో విశ్వసించే పాకిస్థాన్‌కు చెందిన వీడియో ఇది. ఇది చూసైనా అతను కళ్లు తెరుచుకుంటారేమో’ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే, మన దేశ ఆర్మీని బలహీనమైనదిగా చూపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారానికి తెరతీసిందని, సాయుధ దళాలలను, వారి ధైర్యసాహసాలను విమర్శించే విధంగా మాట్లాడిందని నడ్డా ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలను భారత ప్రజలు ఓట్ల రూపంలో తిప్పికొట్టారని వెల్లడించారు.



Next Story