పాతబస్తీలో పాకిస్తానీలు ఉన్నారా..?

by  |
పాతబస్తీలో పాకిస్తానీలు ఉన్నారా..?
X

దిశ, వెబ్‎డెస్క్: పాతబస్తీలో పాకిస్తానీలు ఉన్నారా..? ఇప్పుడు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల రణరంగం మొదలైనప్పటి నుంచి బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అదే విధంగా బీజేపీ నాయకులు ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీపై మాటల తూటాలు పేలుస్తున్నారు.

దుబ్బాక ఎన్నికల విజయాన్ని ఆస్వాధించకముందే బీజేపీకి కొత్త ఎన్నికలు వచ్చి పడ్డాయి. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఉత్కంఠ పోరులో విజయం సాధించారు. దీంతో బీజేపీకి తెలంగాణలో మంచి రోజులొచ్చాయని కేడర్‎లో ఆశలు మొలకెత్తాయి. దుబ్బాక ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి మొదలైంది. దీంతో అన్ని పార్టీలు తమనే విజయం వరించాలని పోటాపోటీగా కసరత్తులు చేస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, పలు స్వతంత్ర పార్టీలు పోటీ చేస్తున్నాయి. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య భీకర పోటీ నెలకొంది. ఇక టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్ ప్రచారం కొనసాగిస్తున్నారు. రోడ్ షోలతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ బీజేపీ శ్రేణులపై విరుచుకుపడుతున్నారు. ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ కోరుకోవాలి అంటే టీఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన కోరుతున్నారు. బీజేపీ ఓట్లు వేస్తే ప్రశాంతమైన నగరంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంటుందంటూ ప్రచారంలో ఆయన ఓట్లు అభ్యర్థిస్తున్నారు. టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు బీజేపీ కూడా గట్టిగా జవాబిస్తోంది. గత ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టోను అమలు చేయకుండా మళ్లీ అదే మేనిఫెస్టోను తిరిగి విడుదల చేస్తున్నారంటూ విమర్శిస్తోంది.

మరో వైపు టీఆర్ఎస్ లో కేవలం కేటీఆర్ మాత్రమే ప్రచారంలో పాల్గొంటుంటే.. బీజేపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, తాజాగా గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రచారంలో దూసుకుపోతూ అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్టేనని హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు బీజేపీ నాయకులు.

ఈ నేపధ్యంలో బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పుడు తెలంగాణలో హిందువులందరూ సంఘటితం కావాలంటూ బీజేపీ నాయకులు పిలుపునిస్తున్నారు. తాజాగా జరిగిన బీహార్ ఎన్నికల్లో ముస్లింలు అందరూ ఏకమవడంతో ఎంఐఎం 5 సీట్లు గెలుచుకుందని, ఇప్పుడు ఇంత మంది హిందువులు ఉన్న హైదరాబాద్ లో బీజేపీకి పట్టం కట్టాలంటూ ప్రచారంలో కోరుతున్నారు.

తాము మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేసి అక్రమంగా ఉన్న పాకిస్తానీలు, రోహింగ్యాలను దేశం నుంచి తరిమేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ పాటుపడుతుందని, జనాభాలో 80 శాతం ఉన్న వారి సంక్షేమం కోసం పాటుపడతామని అన్నారు. ముస్లిం ఓట్ల కోసం పాకులాడేవారు లౌకికవాదులు ఎలా అవుతారంటూ ఆయన ప్రశ్నించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హైదరాబాద్ లో 40 వేల మంది రోహింగ్యాలు, పాకిస్తానీయులు ఉన్నారని ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు కనీసం 1000 మంది రోహింగ్యాలు, పాకిస్తానీయులను చూపించాలని సవాల్ చేశారు. అంతమంది రోహింగ్యాలు ఉంటే కేంద్ర హోం శాఖ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. జీహెచ్ఎంసీలో కేవలం కొన్ని సీట్లు, ఓట్ల కోసం బీజేపీ ప్రశాంతంగా ఉన్న హైదరబాద్ లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు. బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై రాములమ్మ విజయశాంతి స్పందించారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీలు గురించి టీఆర్ఎస్, ఎంఐఎం ఎందుకంత కంగారు పడుతున్నాయంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎవరినైనా దాచిపెట్టడం వల్లే టీఆర్ఎస్ భయాందోళనలకు గురవుతోందని ప్రజలు అభిప్రాయపడే అవకాశం ఉందని కామెంట్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసిందని, పాతబస్తీలో ఎవరూ లేరని ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అధికారిక నివేదిక ఇవ్వొచ్చు కదా అని సెటైర్లు వేశారు విజయశాంతి.

హైదరాబాద్ కు పాకిస్తానీలు, రోహింగ్యాలు వచ్చారంటే కేంద్ర నిఘా వైఫల్యం వల్లే చొరబడ్డారని పలువురు విమర్శిస్తున్నారు. గత ఆరేళ్లలో 40 వేల మంది అక్రమ చొరబాటుదారులు ప్రవేశిస్తూ ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. వీసా గడువు ముగిసినా పాతబస్తీలోనే నివాసం ఉంటున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. బీజేపీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.


Next Story

Most Viewed