తెలుగు కుర్రాడికి అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్

by  |
indian-guy
X

దిశ, ఫీచర్స్ : దేశవిదేశాల్లో భారతీయులతో పాటు, తెలుగువాళ్లు తమ కీర్తి పతాక ఎగరేస్తున్నారు. ఇటీవలే గుంటూరు అమ్మాయి బండ్ల శిరీష అంతరిక్షయానం చేసి చరిత్ర సృష్టించగా.. ప్రపంచ కుబేరుల్లో ఒకడైన జెఫ్ బెజోస్ ఈ రోజు అంతరిక్షయాత్రకు వెళ్లే రాకెట్‌ తయారీలో కీరోల్ పోషించింది ముంబై గర్ల్ సంజల్. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో విద్యార్థి ఖగోళశాస్త్ర పరిశోధనలో అద్భుత ప్రతిభ కనబరచడంతో అమెరికన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకోనున్నాడు. మరి తెలుగు వారందరినీ గర్వించేలా చేసిన ఆ యంగ్ టాలెంటెడ్ కుర్రాడి విశేషాలు మీకోసం

ఆంధ్రప్రదేశ్ సిలేరుకు చెందిన భరద్వాజ్ విజయవాడ కేఎల్ యూనివర్శిటీలో బీటెక్ పూర్తిచేసి, ఎంఎస్ చదవడానికి 2014లో అమెరికా వెళ్ళాడు. యూఎంకేసీ యూనివర్సిటి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌లో ప్రథమస్ధానం దక్కించుకుని పరిశోధనలకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే తన పీహెచ్‌డీ కూడా పూర్తిచేశాడు. విశ్వంలో గెలాక్సీలు ఢీకొన్న క్రమంపై ఏడు సంవత్సరాలుగా శాస్ర్తీయ పరిశోధనలు సాగించాడు. దాంతో ఖగోళ భౌతికశాస్త్రంలో ఆయన చేసిన అసాధారణ పరిశోధనలకు గుర్తింపుగా విశ్వవిద్యాలయం అతనికి డాక్టరేట్ ఇవ్వగా.. యూఎంకేసీ విశ్వవిద్యాలయం నుంచి ‘డాక్టరేట్ పొందిన మొదటి వ్యక్తిగా భరద్వాజ్ నిలిచాడు. దాంతోపాటు 2018లో అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ఈ పరిశోధనలకే బంగారు పతకాన్ని ప్రదానం చేసింది. ‘డాక్టరేట్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నాలో మరింత స్ఫూర్తినింపడంతో పాటు బాధ్యత కూడా పెంచింది. నా పరిశోధనలకు ప్రొఫెసర్ డేనియల్ మెకింతోష్, మార్క్ బ్రాడ్‌విన్‌లు ఎంతో సహకరించారు. పోస్ట్ డాక్టరేట్‌తో పాటు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేస్తాను’ అని భరద్వాజ్ తెలిపారు.

‘తమ కుమారుడి పరిశోధనల్లో ప్రొఫెసర్ డేనియల్ మెకింతోష్, మార్క్ బ్రాడ్‌విన్‌ల ప్రోత్సాహం ఉంది. ఈ పరిశోధనలకుగాను అతను ఎనిమిది సంస్థల నుండి స్కాలర్‌షిప్‌లను పొందాడు. ప్రస్తుతం మరో పరిశోధన ప్రాజెక్టును భరద్వాజ్ కొనసాగిస్తున్నాడు. దానికి నాసా స్కాలర్‌షిప్ అందిస్తుంది. భౌతికశాస్త్రంపై భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి పెంచడమే భరద్వాజ్ లక్ష్యం. త్వరలోనే అతడు ఇండియాకు వస్తాడు’ అని అతడి తల్లిదండ్రులు తెలిపారు.


Next Story

Most Viewed