గవర్నర్‌ బీబీ హరిచందన్‌కు కరోనా..ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స ..

by  |
గవర్నర్‌ బీబీ హరిచందన్‌కు కరోనా..ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స ..
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ నెల 15న పరీక్షలు జరపగా బుధవారం కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గవర్నర్‌ బిశ్వభూషన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఏఐజీ వైద్యులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే బుధవారం ఉదయం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ అస్వస్థతకు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఏఐజీలో చికిత్సపొందుతున్నారు. ఇటీవలే ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించారు.

త్వరగా కోలుకోవాలి

గవర్నర్‌ బీబీ హరిచందన్‌ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. ఏఐజీ చైర్మన్‌, సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డితో నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి సీఎంకు తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ బీబీ హరిచందన్ త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగిరావాలని సీఎం ఆకాంక్షించారు.

గవర్నర్ ఆరోగ్యంతో తిరిగి రావాలి

కొవిడ్‌తో అనారోగ్యానికి గురై హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిశ్వభూషణ్ హరిచందన్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గవర్నర్‌కు మెరుగైన ఆరోగ్యం అందించాల్సిందిగా ఆయన వైద్యులను కోరారు. ఆయురారోగ్యాలతో తిరిగి వచ్చి రాష్ట్రానికి మెరుగైన సేవలందించాలని చంద్రబాబు పేర్కొన్నారు.


Next Story