మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం: ఏపీ ప్రభుత్వం

by  |
AP-HIGH-COURT
X

దిశ, ఏపీబ్యూరో: మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును వెనక్కి తీసుకున్న విషయాన్ని అఫిడవిట్ రూపంలో ఏపీ ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ఈ సందర్భంగా అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. పాత బిల్లుల స్థానంలో మార్పులు తెచ్చి కొత్త బిల్లులను త్వరలోనే తెస్తామని హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచింది. త్వరలోనే బిల్లులు మళ్లీ ప్రవేశపెడతామని పేర్కొంది.

శానససభలో ఉపసంహరణకు సంబంధించిన బిల్లులను హైకోర్టుకు సమర్పించిన సందర్భంలో తాము త్వరలో కొత్త బిల్లులను ప్రవేశపెడతామని కూడా ప్రభుత్వం పేర్కొనడం విశేషం. మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల ఆకాంక్షల మేరకే తాము ముందుకు వెళతామని జగన్ ప్రభుత్వం పేర్కొంది. దీనిపై అమరావతి రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రభుత్వం నిర్ణయంపై రాజధాని రైతుల తరఫు న్యాయవాదులు అధ్యయనం చేస్తున్నారు. ఈ అఫిడవిట్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది.


Next Story