ఏపీ స్థానిక సంస్థల ఎన్నిలకు కేబినెట్ రెడీ

by  |

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఈ సమావేశాల్లో కేబినెట్ చర్చించింది. మార్చి 15 తేదీకంతా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఎన్నికలను డబ్బు, మద్యం లేకుండా చర్యలు చేపట్టాలని.. డబ్బు లేదా మద్యం పంపణీ చేసే అభ్యర్థులపై నేరుగా ఎన్నికల నుంచి అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది.

అనర్హతతో సరిపెట్టకుండా మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించేలా నిర్ణయించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 13 రోజుల నుంచి 15 రోజులకు పెంచే చట్టానికి ఆమోదముద్ర వేసింది. పంచాయతీ ప్రచారం 5 రోజులు నిర్వహించుకునేలా గడువివ్వనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల ప్రచారానికి 7 రోజుల సమయమివ్వనుంది. గిరిజన ప్రాంతాల్లో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీల పోటీకి గిరిజనులు మాత్రమే అర్హులని నిర్ణయించింది. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు కచ్చితంగా గ్రామాల్లోనే ఉండాలన్న నిబంధన విధించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు ఇచ్చినట్టే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు కూడా కేవలం 15 రోజులే కేబినెట్ నిర్ణయించడం విశేషం.

స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. 2019లో విజయం సాధించిన తరువాత తొలిసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కావడంతో దీనిపైనే అందరి దృష్టినిలువనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రశాంత వాతావరణంలో ప్రవేశపెట్టాలని కేబినెట్ భావిస్తోంది.

అలాగే ఏపీ అగ్రికల్చర్ కౌన్సిల్ ముసాయిదా బిల్లు కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ బిల్లు ద్వారా రైతులకు మేలు జరుగుతుందని కేబినెట్ భావిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ నాన్ పైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.

Next Story