ఐదేళ్లు సీఎంగా రేవంత్ కొనసాగడంపై జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by prasad |
ఐదేళ్లు సీఎంగా రేవంత్ కొనసాగడంపై జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో:

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే బీజేపీ, బీఆర్ఎస్ చెరో వైపు నుంచి బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్, బీ, యూ టాక్స్ వసూలు జరుగుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వైట్ పేపర్ లాంటి వారని అలాంటి వైట్ పేపర్లపై మహేశ్వర్ రెడ్డి కావాలనే ఇంక్ చల్లుతున్నారని ధ్వజమెత్తారు. తన గుర్తింపు కోసమే మహేశ్వర్ రెడ్డి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ ఆచితూచి పని చేసుకుంటూ పోయే వ్యక్తి అని, ఆయన ఎవరి ట్రాప్ లోనూ పడే వ్యక్తి కాదన్నారు. కావాలనే ఉత్తమ్ ను టార్గెట్ చేస్తున్నట్లు ఉందని ధ్వజమెత్తారు. ఉత్తమ్ నిజంగానే తప్పు చేసి ఉంటే ఈ పాటికి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసేవన్నారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిది ఉన్నట్లుగా చూపించాలనే ఒక ప్రణాళిక ప్రకారంగా మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

ఐదేళ్లు రేవంతే సీఎం:

రోజుకో ట్యాక్స్ పేరుతో మాట్లాడుతున్న మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడటం కాకుండా తన వద్ద నిజంగా ఆధారాలు ఉంటే వాటిని మీడియాకు అప్పగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఇకనైనా మహేశ్వర్ రెడ్డి ఇటువంటి అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేయడం మానుకోవాలని హితవుపలికారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వేచ్ఛతో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా మహేశ్వర్ రెడ్డి మాట్లాడాల్సింది మాట్లాడే స్వేచ్ఛ ఆయనకు ఉందన్నారు. సీఎం రేస్ ల పంచాయతీ బంద్ చేయాలన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఈ ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి కొనసాగుతారని ఆయనను డిస్ట్రబ్ చేయాలని కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదన్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు. తమ గుర్తింపు కోసం బీఆర్ఎస్ ఓ వైపు బీజేపీ మరోవైపు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ప్రభుత్వం అనే స్పోర్ట్స్ టీమ్ లో అందరూ సమిష్టిగా పని చేసుకుంటూ వెళ్తున్నారని కెప్టెన్ గా రేవంత్ రెడ్డి క్లారిటీ ఉన్నారన్నారు. పీసీసీ పదవిపై తర్వాత స్పందిస్తానన్నారు.

Next Story

Most Viewed