సెల్ టవర్ ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం..

by Mamatha |
సెల్ టవర్ ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం..
X

దిశ,కాకినాడ:సెల్ ఫోన్ దొంగతనం చేశావంటూ చేసిన నిందలకు తట్టుకోలేక ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడి తో చాకచక్యంగా వ్యవహరించి ఆత్మహత్యను నిలువరించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకొని ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన త్రీ టౌన్ పోలీసులను అభినందించారు. వివరాల్లోకి వెళితే..కాకినాడ జిల్లా చిత్రాడకు చెందిన ప్రదీప్ కుమార్‌ను సెల్ఫోన్ దొంగతనం చేసావంటూ స్థానికులు అవమానం చేశారు. అవమానాన్ని భరించలేక ప్రదీప్ కుమార్ ఆత్మహత్య చేసుకోవాలని భావించి కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ టవర్ పై ఎక్కి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కృష్ణ భగవాన్ ఆదేశాల మేరకు ఎస్సై ఎం.సాగర్ బాబు ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గరకు చేరుకుని సమయస్ఫూర్తి గా వ్యవహరించి ఆ యువకుడు చేసే ఆత్మహత్యాయత్నాన్ని నిలువరించ గలిగారు. ఎస్సై సాగర్ బాబు యువకుడికి ధైర్యం చెప్పి, తనపై పడిన నిందను లేకుండా చేస్తామని హామీ ఇచ్చి సురక్షితంగా శ్రీనివాసరావు, సిబ్బంది సాయంతో కిందకు దింపారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఓ యువకుడు ప్రాణాలు కాపాడిన ఎస్సై సాగర్ బాబు, సిబ్బంది శ్రీనివాసరావును స్థానికులు అభినందించారు. చిత్రాడకు చెందిన ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి చేసిన ఈ ఆత్మహత్య ప్రయత్నంతో చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆత్మహత్య ప్రయత్నాన్ని నిలువరించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

Next Story

Most Viewed