‘ఆశ్రమ్’ లాంటి బాబాలు ఉన్నారు : అనుప్రియ

by  |
‘ఆశ్రమ్’ లాంటి బాబాలు ఉన్నారు : అనుప్రియ
X

దిశ, వెబ్‌డెస్క్ :
బాలీవుడ్ భామ అనుప్రియ గొయెంక తెలుగులో మంచు మనోజ్ సరసన ‘పోటుగాడు’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ప్రసారమవుతున్న ‘ఆశ్రమ్’ సిరీస్‌లో తను కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొన్న అనుప్రియ.. తన లైఫ్‌లోనూ ఇలాంటి దొంగ బాబాలు ఉన్నారని తెలిపింది. తమ కుటుంబం అమితంగా నమ్మిన బాబా తనను లైంగికంగా వేధించాడని వెల్లడించింది.

కొందరు నమ్మకాన్ని అలుసుగా తీసుకుంటారని.. ఆ బాబా కూడా ఇలాంటి కేటగిరీకి చెందినవాడే అని చెప్పింది. తను చెప్పే ఆధ్యాత్మిక సూక్తులను చూసి తమ కుటుంబం మొత్తం తనను విశ్వసించడం మొదలుపెట్టారని, కానీ తనకు 18 ఏళ్ల వయసున్నప్పుడు లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది. ముందుగానే తన ప్రవర్తన మీద కొంచెం అనుమానం వచ్చినా.. ఈ ఘటనతో తను ఎలాంటి వాడో అర్థమైందని తెలిపింది. ఎలాగోలా తన నుంచి తప్పించుకున్నానన్న అనుప్రియ.. ఈ మధ్యే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పానని, కానీ బాబా ఇప్పుడు వృద్ధుడు కావడం వల్ల.. తన మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారని తెలిపింది. ఇప్పటికీ ఇలాంటి బాబాలు చాలా మంది మన సమాజంలో, నా జీవితంలో ఉన్నారన్న అనుప్రియ.. వారికి కౌన్సెలింగ్ అవసరమని అభిప్రాయపడింది. ప్రస్తుతం అనుప్రియ చేస్తున్న ‘ఆశ్రమ్’ ప్రాజెక్ట్ కూడా ఇలాంటి బాబాల బాగోతాన్ని బయటపెట్టగా.. మంచి ఆదరణ పొందుతోంది.


Next Story

Most Viewed