ప్రతి గ్రామంలో పది మంది మృతి.. సీఎం యోగిపై బీజేపీ నేత ఫైర్

by  |
UP-Cm-yogi
X

లక్నో : కరోనా కట్టడి చర్యల విషయంలో యోగి ప్రభుత్వంపై మరో బీజేపీ నేత విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి గ్రామంలో కనీసం పది మంది కరోనాతో మరణించారని అన్నారు. కరోనా వైరస్ తొలి వేవ్ నుంచి పాఠాలు నేర్చుకుని ఉంటే సెకండ్ వేవ్ విలయాన్ని కొద్ది మేరకు నియంత్రించేవారని యూపీ సర్కారుపై బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు రామ్ ఇక్బాల్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కరోనాతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం పొంది 75ఏళ్లు దాటినా 34 లక్షల జనాభా గల బలియా జిల్లాలో ఇప్పటికీ ఒక్క డాక్టర్ లేడని వాపోయారు.

యోగి ఆదిత్యానాథ్ ఈ జిల్లాలో పర్యటించినప్పుడు వైద్యారోగ్య శాఖ చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారని, అధికారులే సీఎంను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, రైతుల ప్రయోజనార్థం డీజిల్ ధరలపై సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రాథోడ్ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణపై ప్రభుత్వ చర్యలను విమర్శించారు. తాము ఎక్కువగా మాట్లాడితే తమపైనా దేశద్రోహం మోపుతారని ఆరోపించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ఓ సారి వైద్య వసతుల లోటును పేర్కొంటూ సీఎం యోగికి లేఖ రాశారు.



Next Story

Most Viewed