తెలంగాణలో మరో ‘4’ ఒమిక్రాన్ కేసులు..​టెన్షన్‌లో అధికారులు

by  |
Omicron
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా మరో నలుగురికి ఒమిక్రాన్​ నిర్ధారణ అయింది. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురికి, లండన్ నుంచి వచ్చిన మరో వ్యక్తిలో ఒమిక్రాన్ తేలినట్లు ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. అయితే వారి పేర్లు, అడ్రస్ వివరాలను మాత్రం అధికారులు ప్రకటించలేదు. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 6 కు చేరింది. ఈనెల 11న అబుదాబి నుంచి శంషాబాద్​ ఎయిర్​పోర్టుకు వచ్చి, అక్కడ్నుంచి నేరుగా వెస్ట్​బెంగాల్​వెళ్లిపోయిన వ్యక్తినీ కలుపుకుంటే ఆ సంఖ్య ఏడుకు పెరుగుతుంది. సదరు బాలుడి శాంపిల్​ సేకరణ శంషాబాద్​ ఎయిర్​పోర్టులో జరినందున ఈ కేసు తెలంగాణ స్టేట్​ లెక్కల్లోనే కేంద్రం చూపుతున్నది. కానీ రాష్ట్ర అధికారిక బులిటెన్​లలో వైద్యశాఖ ఆరు గానే ప్రకటించింది. ఇప్పటికే ఇద్దరి వ్యక్తులు హైదరాబాద్​లోని గచ్చిబౌలి టిమ్స్​లో వైద్యం పొందుతుండగా, గురువారం నిర్ధారణ అయిన వ్యక్తులను ట్రేస్​చేస్తున్నట్లు డీహెచ్​శ్రీనివాసరావు పేర్కొన్నారు. పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత విషయాలు వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇక రోజురోజుకీ ఒమిక్రాన్​ కేసులు పెరుగుతుండటంతో ప్రజలతో పాటు అధికారుల్లోనూ టెన్షన్​ మొదలైంది. దీంతో కరోనా కట్టడి కోసం వేగంగా చర్యలు చేపడుతున్నారు.

మూడు రోజుల క్రితమే..

కొత్తగా ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చిన నలుగురిలో ముగ్గురు కెన్యా దేశస్తులు కాగా, హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి లండన్​నుంచి తిరిగివచ్చినట్లు సమాచారం. అతను మూడు రోజుల క్రితమే సిటీకి వచ్చినట్లు తెలిసింది. ఎయిర్‌‌పోర్టులో చేసిన టెస్టులో పాజిటివ్ రావడంతో ఎట్​రిస్క్​ దేశం ట్రావెల్​ హిస్టరీ ఉన్నందున అతన్ని టిమ్స్‌కు తరలించారు. ఇక కెన్యాకు చెందిన ముగ్గురిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక వ్యక్తి ఉన్నారు. వీరు 4 రోజుల క్రితమే హైదరాబాద్‌కు చేరుకున్నట్టు సమాచారం. ర్యాండమ్‌ టెస్టింగ్‌లో భాగంగా ఎయిర్‌‌పోర్టులో ఈ ముగ్గురి సాంపిల్స్‌ తీసుకుని పంపించగా, కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌ కోసం పంపగా, గురువారం ఒమిక్రాన్‌ ఉన్నట్టుగా నిర్దారణ అయింది. కెన్యాకు చెందిన ముగ్గురు 4 రోజుల నుంచి బయటే తిరుగుతున్నారు. హైదరాబాద్‌లోని వేర్వేరు హోటళ్లు, మాల్స్​ చుట్టూ తిరిగినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ ముగ్గురినీ ట్రేస్ చేసి గురువారం రాత్రి టిమ్స్‌కు తరలించినట్టు తెలిసింది.

Next Story

Most Viewed